ఉక్కుపాదం మోపాల్సిందే..
నకిలీ విత్తనాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు
గద్వాల(గద్వాల క్రైం): జిల్లాలో రైతులపాలిట శాపంగా మారుతున్న నకిలీ విత్తనాలపై అధికార యంత్రాంగం పటిష్ట నిఘా పెట్టింది. ఏ రైతు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా వ్యవసాయ, పోలీసుశాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లా పోలీసుశాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి.. ప్రధాన చెక్ పాయింట్ల వద్ద తనిఖీలను ముమ్మరం చేసింది. నడిగడ్డ కేంద్రంగా కొనసాగుతున్న నకిలీ విత్తన మాఫియాను నిలువరించేందుకు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ప్రధానంగా సీడ్‌పత్తి విత్తన కంపెనీలకు పేరుగాంచింది. ఇక్కడి నుంచే నాసిరకం సీడ్‌పత్తి ముఠా కూడా పెచ్చుమీరుతోంది. నకిలీ విత్తన మాఫియా వెనుక ప్రధాన వ్యక్తులు ఉండటం.. వీరికి రాజకీయ భరోసా ఉండటంతో తమ అక్రమార్జనకు ఎదురులేకుండా ఉంది. ఈ నేపథ్యంలో రెండు శాఖల అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.
ముందస్తు ఒప్పందాలతో మోసం..
జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో రైతులు పత్తి, మిరప, వరి, శనగ, వేరుశనగ పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటలను సాగుచేస్తున్నారు. వీటిలో సీడ్‌పత్తి, మిరపను వేలాది ఎకరాల్లో పండిస్తున్నారు. సీడ్‌పత్తి పంటకు అనుకూలమైన నేలలు ఉండటంతో రైతులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా కంపెనీలు సీడ్ ఆర్గనైజర్ల వ్యవస్థతో కుమ్మక్కవుతున్నాయి. రైతులకు ముందస్తుగా పంట రుణాలు అందించి.. తమ వద్దే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఆ త ర్వాత రైతులకు సునాయసంగా నాసిరకం మందులు, విత్తనాలు అంటగడుతున్నారు. అయితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో గుట్టుగా నాసిరకం విత్తనాలను సరఫరా చేస్తున్నారు. గతేడాది టాస్క్‌ఫోర్స్ బృందాలు పలు ఇళ్లు, గోదాంలు, రహస్య స్థావరాల్లో నిల్వ చేసిన నాసిరకం విత్తనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 8 కేసులు నమోదయ్యాయి.
రంగంలోకి టాస్క్‌ఫోర్స్..
నడిగడ్డలో నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ, పోలీసుశాఖ ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దించాయి. నకిలీ విత్తన దందాపై నిరంతరం దాడులు చేపట్టడంతో పాటు సీడ్ ఆర్గనైజర్ల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వారి కదలికలపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లా సరిహద్దుల్లో పటిష్టమైన నిఘా పెట్టారు. ఎవరైనా పట్టుబడిన క్రమంలో అధికారులకు వచ్చే ఒత్తిళ్లను అధిగమించి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై తర్పీదు సైతం ఇచ్చారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించేలా ప్రణాళికలు రూపొందించారు. పాత కేసుల్లో పట్టుబడిన నిందితుల కదలికలను ఇప్పటి నుంచే వాకబు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన సూత్రధారులను సైతం గుర్తించేందుకు సన్నద్ధమవుతున్నారు.
జిల్లాలో నాసిరకం విత్తనాలపై ఉక్కుపాదం మోపుతారా? లేక ఉలిక్కిపాటుతో సరిపెడతారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెండేళ్ల క్రితం నల్లగొండ పోలీసులు జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన నకిలీ విత్తన వ్యాపారులను పట్టుకు న్నారు. ఈ క్రమంలో ఇక్కడి యంత్రాంగం ఉరుకు లు, పరుగులు తీసింది. అయితే ఇక్కడి నిఘా వ్య వస్థ కొరవడటం.. వ్యాపారులిచ్చే కానుకలకు మసకబారిన కళ్లతో ఉండటంతోనే ఇక్కడ వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తా యి. అయితే జిల్లాలో నాసి రకం విత్తనాల మాట వినపడకూడదని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఖరాఖండిగా చెప్పారు. ప్రధానంగా మిరప, పత్తిసాగు చేస్తున్న రైతుల వివరాలు, కంపెనీల వివరాలు తప్పనిసరిగా అధికారులతో ఉండాలని స్పష్టంచేశారు. తనిఖీల పేరుతో వ్యాపారులను ఏమాత్రం ఇబ్బందులు పెట్టొదని.. అన్ని వివరాలను పరిశీలించిన తర్వా తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు
వ్యవసాయ, పోలీసుశాఖ
సంయుక్తంగా తనిఖీలు
నకిలీ విత్తన మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు వ్యూహాత్మకంగా చర్యలు


