గద్వాల: అన్నిశాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. ప్రజల అర్జీలను సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన నేరుగా తెలుసుకుని దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 99 దరఖాస్తులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటిప్పుడు పరిష్కరించాలని ఆయన సూచించారు.
విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసేందుకే శిబిరాలు
మానవపాడు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసేందుకే వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ విజయలక్ష్మి అన్నారు. సోమవారం మానవపాడు మండలంలోని పీఎంశ్రీ జల్లాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, క్రీడలు, ఆరోగ్యం, పౌష్టికాహారం, వినోదం, సామూహిక కృషి, అభ్యసనం విలువలను తెలియజేసేందుకు వేసవి శిబిరాలు ఎంతో దోహదపడుతున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి పట్టుదల, పరస్పర సహకారం, ఆత్మవిశ్వాసం, గౌరవం, బాధ్యతతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నందిని వజ్ర, హెచ్‌ఎం విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
జూన్ 1 నుంచి మయూరి పార్క్‌లో ప్లాస్టిక్ నిషేధం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, పార్క్ పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని, మయూరి పార్క్‌లో జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు డీఎఫ్‌ఓ శివ్ ఆశిష్ సింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్క్‌లోకి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, ఇతర ప్లాస్టిక్ పదార్థాలు తీసుకురావడం అనుమతించమని స్పష్టం చేశారు. సందర్శకులు పర్యావరణహిత వస్తువులు మాత్రమే ఉపయోగించాలని కోరారు. వన్యప్రాణులు, పక్షులు, పార్క్‌లోని సహజ వాతావరణాన్ని కాపాడేందుకు ఈ నిర్భయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే హానిని తగ్గించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని, సందర్శకులు, పర్యాటకులు ఈ నియమాలను పాటించి అటవీ శాఖకు సహకరించాలని విన్నవించారు. ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జోరుగా ధాన్యం విక్రయాలు
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 15,904 బస్తాల ధాన్యం విక్రయానికి రాగా.. ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,835, కనిష్టంగా రూ.1,602 ధరలు లభించాయి. అలాగే 9,130 బస్తాల మొక్కజొన్న రాగా క్వింటా గరిష్టంగా రూ.1,963, కనిష్టంగా రూ.1,601 చొప్పున పలికాయి. వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.8,269, కనిష్టంగా రూ.7,169, ఆముదాలు గరిష్టంగా రూ.6,295, కనిష్టంగా రూ.6,175, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.6,808, కనిష్టంగా రూ.6,528 ధరలు లభించాయి. ఇదిలా ఉండగా.. బాదేపల్లి యార్డుకు సోమవారం భారీగా దిగుబడులు వచ్చిన కారణంగా బస్తాలను లిఫ్టింగ్ చేయని పరిస్థితి ఏర్పడిందని యార్డు కార్యదర్శి అశ్వక్ అహ్మద్ తెలిపారు. దీంతో మంగళవారం యార్డులో క్రయవిక్రయాలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు.


