గద్వాల: జిల్లా ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జాతీయ జలజీవన్ మిషన్ ప్రకారం ప్రతి కుటుంబానికీ అవసరమైన నీటిని సరఫరా చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో గృహ అవసరాలకే కాకుండా విద్యాసంస్థలు, వైద్యశాలలు వంటి ప్రభుత్వ విభాగాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పరిష్కరించాలన్నారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా వసతిగృహాలు, ప్రభుత్వ పాఠశా లు, కేజీబీవీల్లో మురుగు వ్యవస్థ నిర్వహణకు ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీబ్ల్యూఓ సునంద, కలెక్టరేట్ ఏఓ భూపాల్‌రెడ్డి ఉన్నారు.
● రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల పనితీరు, రుణాల పంపిణీ, ఆర్థిక ప్రగతి వంటి అంశాలను వివరించారు. సమావేశంలో డీఆర్డీఓ ముషాయిదాబేగం, ఏపీడీ శ్రీనివాస్, పీఆర్ ఈఈ ప్రభాకర్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ప్రభావతమ్మ పాల్గొన్నారు.


