జగిత్యాల: జిల్లాకేంద్రమైన జగిత్యాల మున్సిపాలిటీ ఇంజినీరింగ్ సెక్షన్‌లో డీఈతోసహా అందరూ బదిలీ కావడంతో శానిటేషన్ విభాగంలో టెండర్లు పిలిచేందుకు జాప్యం జరుగుతోంది. ఇది కార్మికులకు కష్టతరంగా మారింది. జిల్లా కేంద్రంలో లక్షకు పైగా జనాభా ఉంది. ఇక్కడ ప్రతిరోజూ చెత్తను తొలగించాల్సిందే. నాలుగు జోన్లలో కార్మికులు నిత్యం ఆటోలు, ట్రాక్టర్లలో చెత్తను సేకరిస్తుంటారు. 36వ డివిజన్‌తోపాటు.. మరికొన్ని వార్డుల్లో ఆటోలు, ట్రాక్టర్లు చెడిపోవడంతో ఆ జోన్లో పనిచేస్తున్న కార్మికులకు చెత్త సేకరణ కష్టతరంగా మారింది. చేసేదేమీలేక ఒక పెద్ద సంచితో కార్మికులు ఇంటింటికీ వెళ్తూ.. చెత్త సేకరించాల్సి వస్తోంది. అతిపెద్ద మున్సిపాలిటీ అయిన జగిత్యాలలో జేసీబీ, ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్‌తోపాటు చాలావరకు ఆటోలు మరమ్మతుల్లోనే ఉంటున్నాయి. ఇటీవలే టిప్పర్లు, జేసీబీలను రూ.1.5లక్షలతో మరమ్మతు చేయించినా.. మళ్లీ మొరాయిస్తున్నాయి. ఫలితంగా శానిటేషన్ అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ డంపింగ్‌యార్డులను తలపిస్తున్నాయి. కాలనీల్లో చెత్త సేకరణ లేకపోవడంతో ప్రజలు రోడ్లపైనే చెత్తను పారబోస్తున్నారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో జగిత్యాల మున్సిపాలిటీ అధ్వానంగా మారింది. ఒకవైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మున్సిపాలిటీలో పనులన్నీ పెండింగ్‌లో ఉండడం గమనార్హం.
చెత్త సేకరణలో కార్మికులకు ఇబ్బందులు
ట్రాక్టర్లు, ఆటోలు మరమ్మతుల్లో ఉండటంతో చెత్త సేకరణలో కార్మికులకు ఇబ్బందికరంగా మారింది. అసలే వారికి చీపుర్లు, చేతులకు గ్లౌజులు, కాళ్లకు షూస్ ఇవ్వకపోవడంతో కార్మికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆటోల్లో తిరుగుతూ ఎలాగోలా చెత్త సేకరణ చేస్తున్నప్పటికీ వాహనాలు మరమ్మతుకు రావడంతో ఏమీ చేయలేక చివరకు చెత్త సేకరణకు సంచులతో బయల్దేరాల్సి వస్తోంది.
తరుచూ మరమ్మతులే..
జిల్లా కేంద్రంలో పారిశుధ్య నిర్వహణ గాడితప్పుతోంది. చెత్తాచెదారం తరలించేందుకు.. రహదారులు శుభ్రం చేసేందుకు.. డ్రైనేజీల్లో పూడిక తీసేందుకు.. ఫాగింగ్ చేసేందుకు ఎక్కువగా వాహనాలనే వినియోగిస్తుంటారు. కొనుగోలు, మరమ్మతుకు రూ.లక్షలు వెచ్చిస్తున్నా మళ్లీమళ్లీ మరమ్మతుకు రావడం గమనార్హం. ఫలితంగా చెత్తసేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒకవైపు తడి, పొడి చెత్త వేరు చేయాలని, ఇంటి ఎదుటకు వచ్చిన మున్సిపల్ వాహనాలకే చెత్త అందించాలని పేర్కొంటున్నా వాహనాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. బల్దియాలో 50 వార్డులు ఉండగా.. దాదాపు 300 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. చెత్త సేకరణ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇది ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో రూ.50 లక్షల వ్యయంతో స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేశారు. అది ఒక్కసారి కూడా పనిచేయలేదు. రూ.50 లక్షలు దుర్వినియోగం అయ్యాయి. అధికారులు మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
బదిలీలతో టెండర్లలో జాప్యం
శానిటేషన్‌కు సంబంధించి వాహనాల మరమ్మతులు చేయించాలంటే ఇంజినీరింగ్ సెక్షన్ అధికారులు మాత్రమే టెండర్లు వేయాల్సి ఉంటుంది. కానీ ఆ విభాగంలోని అధికారులందరూ బదిలీపై వెల్లిపోయారు. డీఈతోపాటు, ఇద్దరు ఏఈలు బదిలీ కావడంతో ఆ శాఖ ఖాళీగా ఉంది. డీఈ స్థానంలో మరో డీఈకి పోస్టింగ్ ఇచ్చినా ఆయన ఇప్పటి వరకు జాయిన్ కాలేదు. ఏఈలను పూర్తిగానే ఇవ్వలేదు. దీంతో టెండర్లలో జాప్యం జరుగుతోంది. అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మరమ్మతుల కోసం టెండర్లు వేయకపోతే వాహనాలన్నీ మూలకే ఉండే పరిస్థితి నెలకొంది. మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని వాహనాల మరమ్మతుకు సంబంధించి టెండర్లు వేసి అటు శానిటేషన్ మెరుగుపర్చడంతోపాటు, బల్దియా కార్మికులకు సైతం ఇబ్బందులు లేకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
వార్డులు 50
ట్రాక్టర్లు 45
ఆటోలు 11
ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్1
స్వీపింగ్ మిషన్ 1
ఫాగింగ్ మిషన్లు 2
జేసీబీ 1


