ఇప్పుడు మీరు చేసే ఈ చిన్న తప్పు వల్ల మీ ఫ్యూచర్‌లో.. | Hidden kind of stress can damage your memory as you age Study | Sakshi
Sakshi News home page

ఇప్పుడు మీరు చేసే ఈ చిన్న తప్పు వల్ల మీ ఫ్యూచర్‌లో..

Apr 29 2026 3:55 AM | Updated on Apr 29 2026 4:31 AM

Hidden kind of stress can damage your memory as you age Study

వాషింగ్టన్ డీసీ: బాధ, కోపం, నిరాశ లాంటి భావాలను బయటకు వ్యక్తం చేయకుండా లోపలే దాచుకుంటారు కొందరు. తమ సమస్యల గురించి మాట్లాడకుండా మౌనం వహిస్తుంటారు. వారిలోని ఇలాంటి ఒత్తిడి బయటకు కనిపించదు.. కానీ, లోపల మానసికంగా, శారీరకంగా ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంలో ఇది జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపవచ్చు. రట్‌గర్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్, హెల్త్ కేర్ పాలసీ అండ్ ఏజింగ్ రీసెర్చ్ పరిశోధకుల అధ్యయనంలో ఇందుకు సంబంధించిన విషయాలు తేలాయి. 

ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను “జర్నల్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ఆల్జీమర్స్ డిసీజ్”లో ప్రచురించారు. ఈ అధ్యయనాన్ని ప్రత్యేకంగా చైనీస్ అమెరికన్లపై నిర్వహించారు. 60 ఏళ్లు పైబడిన చైనీస్ అమెరికన్లలో జ్ఞాపకశక్తి తగ్గుదల, ఒత్తిడి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పరిశోధకులు వారిని ఎంపిక చేసి ఈ పరిశోధన చేశారు. 

ఒత్తిడిని బయటకు చెప్పకుండా తమలోనే దాచుకునే వారిలో జ్ఞాపకశక్తి తగ్గుతోందని తేల్చారు. కొన్ని సమాజాల్లో “బలంగా ఉండాలి”, ఒత్తిడి గురించి “బయటకు చెప్పకూడదు” అనే భావనలు ఉంటాయి. ఈ కారణంగా వాళ్లు తమ బాధ, ఒత్తిడిని బయటకు చెప్పరు. దాంతో ఆ సమస్యలను ఎవరూ గుర్తించరు, చికిత్స కూడా జరగదు.

ఈ అధ్యయనం చెబుతున్నది ఏమిటంటే.. అలాంటి సంస్కృతి, పరిస్థితులను అర్థం చేసుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఒత్తిడి తగ్గించే పద్ధతులతో వృద్ధుల్లో మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తిని కాపాడవచ్చు. వ్యక్తి సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని వారికి సాయం చేస్తేనే ఒత్తిడిని తగ్గించడంలో మంచి ఫలితాలు వస్తాయి.

‘ఆసియన్ అమెరికన్‌ వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కానీ ఈ వర్గంపై జ్ఞాపకశక్తి తగ్గుదల గురించి ఎక్కువగా పరిశోధనలు జరగలేదు. కాబట్టి, ఈ వృద్ధుల్లో జ్ఞాపకశక్తి ఎందుకు తగ్గుతుంది? దానికి కారణాలు ఏమిటి అన్నది బాగా అర్థం చేసుకోవడం ఇప్పుడు చాలా అవసరం’ అని రట్‌గర్స్ సెంటర్ ఫర్ హెల్తీ ఏజింగ్ రీసెర్చ్ సభ్యురాలు, అధ్యయన ప్రధాన రచయిత మిషెల్ చెన్ తెలిపారు. ఆ వర్గంపై డేటా తక్కువగా ఉంది, కానీ వారి సంఖ్య పెరుగుతోంది కాబట్టి మరింత అధ్యయనం అవసరమని వివరించారు.

వృద్ధాప్యంలో ఉన్నవాళ్లలో ఒత్తిడి, నిరాశ వంటి భావనలు బయటకు కనిపించకపోవచ్చు. కానీ, అవి మెదడు ఎలా పనిచేస్తుందో, వయస్సుతో అది ఎలా మారుతుందో అనే విషయంపై చాలా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా, ఈ భావాలను తగ్గించడం సాధ్యమే. అందుకే వ్యక్తుల సంస్కృతి, నేపథ్యాన్ని అర్థం చేసుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఒత్తిడి తగ్గింపు పద్ధతులు రూపొందించాలనేది ఈ పరిశోధన లక్ష్యం. 

Advertisement
 
Advertisement
Advertisement