అత్యవసర వ్యవసాయ ఉత్పాదకాలైన ఎరువుల ఉత్పత్తి కోసం సహజ వాయువును తీసుకువెళ్లే ఓడలను హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించటాన్ని వెంటనే పునఃప్రారంభించకపోతే ప్రపంచ ఆహార ధరలు ఈ ఏడాది చివర్లో విపరీతంగా పెరిగే ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) తీవ్రస్వరంతో హెచ్చరిస్తోంది. హార్ముజ్ జలసంధిలో రవాణాకు దీర్ఘకాలిక అంతరాయాలు కోవిడ్–19 అనంతర కాలాన్ని గుర్తుచేసే విధంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను, సరఫరా గొలుసులో ఆటంకాలను ప్రేరేపించగలవని ఎఫ్‌ఏఓ హెచ్చరించింది.
పంటల క్యాలెండర్ల ప్రకారం ఎరువులు, ఇంధన ఉత్పాదకాలు సకాలంలో అందకపోవటం, అధిక ధరల కారణంగా పేద దేశాలు అత్యధిక ప్రమాదంలోకి కూరుకుపోతున్నాయని ఎఫ్‌ఏఓ ముఖ్య ఆర్థికవేత్త మాక్సిమో టొరెరో ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఏఓ ఆర్థిక విభాగం డైరెక్టర్ డేవిడ్ లాబోర్డ్‌తో కలిసి ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు.
ముడి చమురు, నత్రజని ఎరువుల తయారీకి ఉపయోగించే సహజ వాయువు, ఇంకా ఇతర ఎరువులు రవాణా కావడం లేదు. ఫాస్ఫేట్ ఎరువుల తయారీకి ఉపయోగించే సల్ఫర్ రవాణా కూడా స్తంభించిందని ఆయన అన్నారు. నౌకలు కదలకపోతే, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ–ఆహార వ్యవస్థకు, ఆర్థిక వృద్ధికి, ఇంకా అనేక రంగాల రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన కీలక వనరులపై గణనీయమైన ప్రభావం పడుతుందని టొరెరో హెచ్చరించారు. రాబోయే రోజుల్లో నౌకలు కదలడం ప్రారంభిస్తాయని ఆశిస్తున్నానన్నారు.
‘సమయం గడిచిపోతోంది..’
‘సమయం గడిచిపోతోంద’ని ఎఫ్‌ఏఓ ప్రధాన ఆర్థికవేత్త టొరెరో అన్నారు. వ్యవసాయ–ఆహార వ్యవస్థకు సంబంధించిన ప్రతిదీ పంటల క్యాలెండర్‌తో ముడిపడి ఉందని వివరించారు. మనం పంటల క్యాలెండర్‌ను పాటించకపోతే, విత్తనాలు/ నాట్లు వేసే సమయంలో రైతుల దగ్గర పెట్టుబడులు లేక΄ోతే తక్కువ పెట్టుబడులతో వ్యవసాయం చేయవలసి వస్తుంది. అందువల్ల రానున్న ఒకటి, రెండు పంటకాలాల్లో దిగుబడులు తగ్గి΄ోవచ్చు.
అలాగే ఆహారం, నిత్యావసరాల ధరలు పెరిగిపోవచ్చు. ప్రస్తుతం మనం ఈ అత్యవసర పరిస్థితిలో ఉన్నాం. దీనివల్ల వడ్డీ రేట్లు పెరుగుతాయని, అది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నారు. కోవిడ్–19 నుండి కోలుకున్న తర్వాత అనుసరించిన విధానాల మాదిరిగానే, అన్ని దేశాలు ధరలను తగ్గించే విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల, ఈ నౌకలు ఇప్పుడు కదలడం ప్రారంభించడం చాలా ముఖ్యం అని టొరెరో నొక్కి చెప్పారు.
ఆహార పంటల సాగు తగ్గొచ్చు
ధరల సూచి ఏప్రిల్‌లో పెరుగుతోందని, మేలో అది మరింత తీవ్రమవుతుందని టొరెరో పేర్కొన్నారు. ఎరువుల లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపికలను మార్చుకోవాలా వద్దా? పెరిగిన చమురు ధరలతో ప్రయోజనం పొందడానికి జీవ ఇంధనాల ఉత్పత్తికి అనువైన పంటల సాగుకు ఎక్కువ భూమిని, వనరులను కేటాయించటంపై రైతులు నిర్ణయాలు తీసుకుంటారు.
దీని వల్ల ప్రపంచ ఆహార సరఫరా తగ్గిపోతుంది. అందుకే కాల్పుల విరమణ కొనసాగడం, జలసంధిలోని నౌకలు కదలటం అత్యవసరమని అన్నారు. ముఖ్యంగా ఇంధనం, ఎరువులపై ఎగుమతి ఆంక్షలను నివారించాలని ఎఫ్‌ఏఓ అన్ని దేశాలను కోరింది.
మాక్సిమో టొరెరో ఎఫ్‌ఏఓ ముఖ్య ఆర్థికవేత్త


