Kavitha Naga Vlogs: ఆమె మనసుకు రుచి తెలుసు

Blind Visually-impaired YouTube Cooking Star Boddu Naga Lakshmi - Sakshi

ఆమెకు చూపు సరిగా లేదు. కాని అద్భుతంగా వండుతుంది. ఇలా వండమని యూ ట్యూబ్‌లో వంటలు చేస్తూ అందరినీ అభిమానులుగా మార్చుకుంది. ఒకరు కాదు... ఇద్దరు కాదు రెండున్నర లక్షల మంది సబ్‌స్క్రయిబర్లతో స్టార్‌గా వెలుగుతున్న తెలుగు చెఫ్‌ బొడ్డు నాగలక్ష్మి. ఈమె వీడియోలు చూశారా మీరు?

‘అందరికీ నమస్తే. నేను నాగలక్ష్మి, ఈమె కవిత. మేమిద్దరం వదిన మరదళ్ళం’ అని మొదలవుతుంది నాగలక్ష్మి చేసే వీడియో. నిజానికి ఆమె చేసేది జంట వీడియో. ప్రతి వీడియోలోనూ వదిన కవిత ఉంటుంది. ఇద్దరి పేరు మీద ‘కవిత నాగ వ్లోగ్స్‌’ పేరుతో యూట్యూబ్‌ చానల్‌ ఉంది. 2020 వ సంవత్సరం సెప్టెంబర్‌లో మొదలైన చానల్‌ రెండేళ్ల లోపే రెండున్నర లక్షల సబ్‌స్క్రయిబర్లను సాధించింది. నాగలక్ష్మికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తోంది. ఇంతచేసి నాగలక్ష్మికి చూపు లేదు. కాని అది ఆమె విజయానికి అడ్డంకి కాలేదు.

బతికిన పసిగుడ్డు
నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన రైతు కృష్ణారెడ్డి ఆఖరు కూతురు నాగలక్ష్మి. పుట్టుకతోనే చూపు లేదు. పురిట్లో చూసిన బంధువులు ‘ఎందుకు కృష్ణారెడ్డి అవస్థ పడతావు. వడ్లగింజ వేసెయ్‌’ అని సలహా ఇచ్చారు. కాని నాగలక్ష్మి తల్లి బిడ్డను గుండెలకు హత్తుకుంది. ‘చూపులేకపోతే నా బిడ్డ కాకుండా పోతుందా’ అంది. వయసు పెరిగాక అర్థమైన విషయం ఏమిటంటే నాగలక్ష్మికి ఎడమ కన్ను పూర్తిగా కనిపించదు. కుడికన్ను ఏదైనా వస్తువు దగ్గరగా పెట్టుకుంటే 5 శాతం కనిపిస్తుంది. అంటే ఆమె కుడికన్ను చాలా కొద్దిగా అతి దగ్గరి వస్తువులు (రెండు అంగుళాల దూరంలో) ఉంటే చూస్తుంది. అయినా సరే నాగలక్ష్మి బెదరలేదు. ఐదు వరకు బడికి వెళ్లింది. ఆ తర్వాత ఇంట్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉండిపోయింది. నీళ్లు మోయడం మామూలు పనులు చేయడం చూపు లేకపోయినా అడుగుల అంచనాను బట్టి అలవాటు చేసుకుంది. కాని సమస్యలు ఆమెను వదల్లేదు.

తల్లి వియోగం
18 ఏళ్ల వయసులో తల్లి మరణించింది. అప్పటికి అక్కకు పెళ్లయి వెళ్లిపోవడంతో ఇంటిలో వంట పని నాగలక్ష్మి బాధ్యత అయ్యింది. తండ్రికి, అన్నయ్యకు ఆమే వండి పెట్టాల్సి వచ్చింది. కాని అన్నం వండటం తప్ప నాగలక్ష్మికి ఏమీ రాదు. అప్పుడు పక్కనే ఉండే ఒక అవ్వ ఆమెకు సాయం చేసింది. ‘నువ్వు వండుతూ ఉండు. నేను పక్కన ఉండి సలహా ఇస్తుంటాను’ అని పక్కన ఉండి వంట నేర్పించింది. ఆ అవ్వకు బాగా వండటం వచ్చు. అది నాగలక్ష్మికి కూడా వచ్చేసింది. అయినప్పటికీ ఇంట్లో ఆడతోడు లేకపోవడం వల్ల శారీరకంగా మానసికంగా వచ్చే ఇబ్బందులకు తోడు కోసం నాగలక్ష్మి బాధలు పడింది. అయితే ఆమె అన్న ఆదిరెడ్డి వివాహం చేసుకుని ప్రకాశం జిల్లాకు చెందిన బోండాల కవితను
కోడలిగా తేవడంతో ఆమె జీవితానికి పెద్ద ఆసరా దొరికింది.

యూట్యూబ్‌ ప్రయోగాలు
2018లో నాగలక్ష్మి అన్న ఆదిరెడ్డి యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించి ‘బిగ్‌బాస్‌’ షో మీద కామెంటరీ చెప్పేవాడు. ఆ వీడియోలు హిట్‌ అయ్యి అతనికి పేరు వచ్చింది. ఆ సందర్భంలో ఒకరోజు నాగలక్ష్మి చేత సరదాగా కామెంటరీ చెప్పిస్తే ఆ వీడియో అందరూ బాగుందన్నారు. అప్పటికి నాగలక్ష్మికి సీరియల్స్‌ పిచ్చి బాగా ఉండేది. టీవీలో సీరియల్స్‌ను చూసేది (వినేది). ఫోన్‌లో అయితే కంటికి దగ్గరగా పెట్టుకుంటే సీరియల్‌ బూజరగా కనిపిస్తుంది. అందువల్ల ఆదిరెడ్డి ఆమె చేత ‘సీరియల్‌ పిచ్చి’ అనే షో చేయించాడు. కాని దానికి పెద్ద స్పందన రాలేదు. కాని 2020లో లాక్‌డౌన్‌ సమయంలో నాగలక్ష్మి, కవిత కలిసి వంట వీడియోలు మొదలెట్టారు. ఇద్దరూ మంచి మాటకారులు కావడంతో రెండు రోజుల్లోనే 10 వేల మంది సబ్‌స్క్రయిబర్లు వచ్చారు. ‘కవిత నాగ వ్లోగ్స్‌’ అలా మొదలైంది.

జామకాయ రోటి పచ్చడి
నెల్లూరు పప్పుచారు

తనకు చూపు లేదని ఈసురోమనడం నాగలక్ష్మి స్వభావంలో లేదు. ప్రతి వీడియోలో వదినతో కలిసి హుషారుగా కబుర్లు చేస్తుంది. చూపున్నట్టే వంటగదిలో కదలుతూ వంట చేస్తుంది. వదిన మరదలు కలిసి స్థానిక వంటలు రకరకాలుగా చేస్తూ భారీగా అభిమానులను కూడగట్టుకున్నారు. నాగలక్ష్మి చేసే పప్పుచారుకు పెద్ద గిరాకీ ఉంది. అలాగే చుక్కకూర పచ్చడి వీడియో పెద్ద హిట్‌ అయ్యింది. పచ్చి జామకాయ రోటి పచ్చడి కూడా ఈమె రుచి చూపించింది. చపాతీ లడ్డు మరో వెరైటీ. నెల్లూరు చేపల పులుసును అథెంటిక్‌గా చేసి చూపిస్తుంది. ‘నేను నూనె ఎక్కువ వేశానని ఒక్కరు కూడా అనరు. అంత సరిగ్గా వేస్తాను’ అంటుంది నాగలక్ష్మి.

రకరకాల కామెంట్లు
నాగలక్ష్మి వీడియోలకు 40 ఏళ్లు దాటిన అభిమానులు ఎక్కువ. అయితే ఈ వదిన మరదళ్ల మధ్య కూడా తంపులు పెట్టడానికి అన్నట్టు వీడియోల కింద కొందరు కామెంట్లు పెట్టారు. వీరు విడిపోయారని కూడా అన్నారు. కాని వదిన మరదళ్లు కలిసి వీడియోలు చేస్తూనే ఉన్నారు. తమ ఇంట్లో జరిగే ప్రతి విశేషాన్ని దాపరికం, శషభిషలు లేకుండా వ్యూయెర్స్‌తో పంచుకోవడమే వీరి వీడియోలలో విశేషం.

‘చిన్న చిన్న సమస్యలతో ఆత్మహత్యలు చేసుకునేవారి వార్తలు వింటుంటాను. ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవాలనేదే నా సలహా’ అని నాగలక్ష్మి అంటుంది. తన సంపాదన నుంచి సోనూసూద్‌ ఫౌండేషన్‌కు, సిఎం రిలీఫ్‌ ఫండ్‌కు డొనేట్‌ చేసింది నాగలక్ష్మి.
అపజయం ఆమె కంట పడలేదు. ఆమె తన ప్రతి అడుగులోనూ వినేది గెలుపు పిలుపునే.     
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top