పిల్లల సమాచారం.. సోషల్‌గా వద్దు! | Advice From Security Experts And The Police To Parents Regarding Children | Sakshi
Sakshi News home page

పిల్లల సమాచారం.. సోషల్‌గా వద్దు!

Jun 10 2026 10:23 AM | Updated on Jun 10 2026 10:23 AM

Advice From Security Experts And The Police To Parents Regarding Children

తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు..

సోషల్‌ మీడియాలో పెడితే సైబర్‌ నేరగాళ్లు

మార్ఫింగ్, బుల్లీయింగ్, సెక్స్‌టార్షన్‌కు తెగబడే ప్రమాదం

తల్లిదండ్రులకు సైబర్‌ భద్రతా నిపుణులు, పోలీసుల సూచన

సాక్షి, హైదరాబాద్‌: ‘నా బిడ్డ స్కూల్‌లో ఫస్ట్‌ వచ్చింది’, ‘ఇవాళ నా కుమారుడి పుట్టినరోజు.. ‘మా పాప అక్షరాభ్యాసం చేయించాం’, ‘మా పిల్లలను ఫలానా స్కూల్‌లో చేర్పించాం..’ అంటూ పిల్లలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమ వేదికల ద్వారా పంచుకోవడం ఇప్పటి తరం తల్లిదండ్రులకు సాధారణమైంది.

అయితే ఈ చర్యలే పిల్లలను సైబర్‌ నేరగాళ్ల బారిన పడేలా చేస్తున్నాయని సైబర్‌ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల ఆన్‌లైన్‌ భద్రతపై స్కూళ్లు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సైతం సూచిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల చేతికి ఒక స్కూల్‌ వార్షికోత్సవంలో తీసిన ఫొటోలో విద్యార్థి పేరు, స్కూల్‌ లోగో, తరగతి వివరాలు కనిపిస్తే, సోషల్‌ మీడియా ద్వారా ఆ బాలుడి పూర్తి డిజిటల్‌ ప్రొఫైల్‌ను సేకరించడం సైబర్‌ నేరగాళ్లకు సులభమవుతుందని చెబుతున్నారు.

అనంతరం ఫేక్‌ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకున్నట్లు దేశంలోని సైబర్‌ భద్రతా సంస్థలు పలుమార్లు హెచ్చరించాయి.

  • ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మీ వివరాలు ఇతరులకు కనిపించకుండా ప్రైవేటు సెట్టింగ్‌లు పెట్టుకోవాలి.

  • లొకేషన్‌ ట్యాగ్‌లను నిలిపివేయాలి. సోషల్‌ మీడియా ప్రైవసీ సెట్టింగ్స్‌ను కఠినంగా అమలు చేయాలి.

  • పిల్లలకు సైబర్‌ భద్రతపై అవగాహన కల్పించాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement