‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’ అని నిరూపిస్తున్నారు 73 ఏళ్ల ఒక బామ్మ. ఏమాత్రం భయం లేకుండా ఆకాశంలో విహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రసిద్ధ సాహస క్రీడల కేంద్రమైన బీర్ బిల్లింగ్‌లో ఆమె చేసిన పారాగ్లూడింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను పారాగ్లైడింగ్ ఇన్ స్ట్రక్టర్ అరుణ్ సింగ్ తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో కూడా ఆ బామ్మ ఏమాత్రం కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా, ఇన్ స్ట్రక్టర్‌తో నవ్వుతూ మాట్లాడుతుండటం విశేషం.
ఇన్ స్ట్రక్టర్ ఆమె వయసు అడగగా, తనకు 73 ఏళ్లు అని ఆమె ఎంతో ఉత్సాహంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా ఇలాంటి సాహస కృత్యాలు చేయడం తనకు ఇదే మొదటిసారి కాదని, గతంలో ముస్సోరీలో కూడా ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసినట్లు తెలిపారు. పారాగ్లైడింగ్ అనేది చాలా ప్రత్యేకమైన అనుభూతి అని, తాను దీన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానని ఆమె చెప్పారు.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ బామ్మ ఆత్మవిశ్వాసాన్ని కొనియాడుతున్నారు. ‘నేను కూడా ఈ దాదీ లాగే తయారవ్వాలనుకుంటున్నాను అని ఒకరు కామెంట్ చేయగా.. ‘జీవితాన్ని మనకు నచ్చినట్లు జీవించాలి! కలలను ఎప్పుడూ వదులుకోవద్దు’ అని మరొకరు రాసుకొచ్చారు. ‘ఎంత ఉత్సాహవంతురాలైన బామ్మ!’ అంటూ మరొకరు ప్రశంసలు కురిపించారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ బామ్మ చేస్తున్న సాహసకృత్యాలు, చూపిస్తున్న ఆత్మవిశ్వాసం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.


