కోనసీమ రైలుకు చంద్ర గ్రహణం
తాజాగా అమలాపురం మండలం రోళ్లపాలెంలో
కొత్త అలైన్‌మెంట్ కోసం సర్వే చేసి జెండా కర్ర పాతిన అధికారులు
● 30.33 కిలోమీటర్ల రైల్వే లైన్
భూసేకరణకు అవరోధాలు
● బడ్జెట్‌లో నిధులు కేటాయించని
బాబు ప్రభుత్వం
● వైఎస్సార్ సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ
వాటాగా రూ.50 కోట్ల విడుదల
● నిధులివ్వాలని రాష్ట్రం చేస్తున్న
విజ్ఞప్తులను పట్టించుకోని రైల్వే శాఖ
సాక్షి, అమలాపురం: కోనసీమ రైలుకు ‘చంద్ర’ గ్రహణం వీడడం లేదు. ఏడాదిన్నరగా పనులు సాగడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి భూసేకరణ నత్తను తలపిస్తోంది. మిగిలిన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఈ ప్రాంత వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో దీని ప్రస్తావన లేకపోవడంతో ఈ ప్రభుత్వం ఉండగా రైల్వే ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం కలగడం లేదని అంటున్నారు.
కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు భూసేకరణ ప్రధాన అవరోధంగా మారింది. కాకినాడ– కోటిపల్లి– అమలాపురం– నర్సాపురం రైల్వే లైన్ పాత అలైన్‌మెంట్ ప్రకారం మొత్తం పొడవు 102.507 కిలోమీటర్లు. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు 45.300 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణం పూర్తి కాగా, కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు 57.207 కిలోమీటర్ల వరకు నిర్మించాల్సి ఉంది. కోటిపల్లి నుంచి అమలాపురం శివారు భట్నవిల్లి వరకు 12.05 కిలోమీటర్ల వరకు భూసేకరణ సైతం పూర్తయింది. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ నుంచి నర్సాపురం వరకు 8.32 కిలోమీటర్ల సేకరణ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ చొరవతో పూర్తయ్యింది. గౌతమీ, వైనతేయ, వశిష్ఠ వంతెనల కోసం అవసరమైన 6.506 కిలోమీటర్ల సేకరణ పూర్తయ్యింది. మిగిలింది భట్నవిల్లి నుంచి మలికిపురం మండలం దిండిలోని వశిష్ఠ నదిపై నిర్మించే వంతెన వరకు పూర్తి చేయాల్సి ఉంది. ఇది 30.331 కిలోమీటర్ల (పాత అలైన్‌మెంట్ ప్రకారం), కొత్త అలైన్‌మెంట్ అయితే మరి కొంతదూరం పెరిగే అవకాశముంది.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో..
కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో పాతిక శాతం భరిస్తామని ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత అప్పుల ఊబిలో ఉన్న నేపథ్యంలో పాతిక శాతం వాటా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.2,120 కోట్లు. దీనిలో 25 శాతం అంటే రూ.530 కోట్లు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఆ స్థాయిలో నిధులు ఇవ్వలేమని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గుర్తించింది. విభజన వలన నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పాతిక శాతం నిధులు ఇచ్చే పరిస్థితి లేదని, రైల్వే ప్రాజెక్టుకు అవసరమైన భూమిని మాత్రం సేకరించి ఇస్తామని ప్రతిపాదించింది. ఇందుకు రైల్వే శాఖ సూచనప్రాయంగా అంగీకారం తెలపడంతో గత ప్రభుత్వం ముందుకు వచ్చి భూసేకరణకు సిద్ధమైంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. అప్పట్లో సుమారు 600 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని అంచనా. అమలాపురం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలలో రైల్వేలైన్‌కు అవసరమైన భూమి గుర్తించేందుకు సర్వే చేపట్టారు. రైల్వేశాఖతోపాటు రెవెన్యూ అధికారులు కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు. అమలాపురం మండలంలో పేరూరులో 80.50 ఎకరాలు, కామనగరువు, రోళ్లపాలెంలో 68 ఎకరాలు, అల్లవరం మండలం బోడసకుర్రులో 59 ఎకరాలు, మలికిపురం మండలం గుడిమెళ్లంకలో 60 ఎకరాల చొప్పున సేకరించే భూమిని గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో చించినాడ నుంచి నర్సాపురం వరకు భూ సేకరణ పూర్తి చేసి పరిహారం కూడా అందించారు. ఇలా సేకరించిన భూమి చుట్టూ రాళ్లు కూడా పాతారు. తరువాత ఎన్నికల రావడం, ప్రభుత్వం మారడంతో భట్నవిల్లి నుంచి దిండి వరకు సాగాల్సిన సర్వే పనులు దాదాపు నిలిచిపోయాయి.
చంద్రబాబు పాలనలో సమస్య మొదటికి..
చంద్రబాబు ప్రభుత్వం రాకతో రైల్వే ప్రాజెక్టు భూసేకరణ అంశం మొదటికి వచ్చింది. టీడీపీ, జనసేనలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు రైల్వే లైన్ తమ పొలాల మీదగా వెళ్లనిచ్చేది లేదని అడ్డుకోవడంతో సర్వేకు ఆటంకాలు ఏర్పడటం మొదలయ్యింది. గత ప్రభుత్వం తామే భూమి సేకరించి ఇస్తామని రైల్వే శాఖకు చెప్పగా, చంద్రబాబు ప్రభుత్వం రైల్వేశాఖ నుంచి భూసేకరణకు సొమ్ము అడగడంతో మరో పీటముడి పడింది. దీనికితోడు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కోనసీమ రైల్వే ప్రాజెక్టు భూ సేకరణకు నిధులు చూపించకపోవడంతో ప్రాజెక్టును రైల్వేశాఖ పూర్తి చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి భాగస్వామ్య నిధులు లేవని తేలిపోయింది. ఏడాదిన్నరగా పడకేసిన ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన భూసేకరణకు నిధులు కూడా ఇవ్వకపోవడంతో పనులు ఇప్పుడప్పుడే మొదలవుతాయనే నమ్మకం, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి ఉండగా పూర్తవుతుందన్న గ్యారెంటీ లేకుండా పోయింది.
నాడు ఇచ్చింది రూ.రెండు కోట్లకు జీవో మాత్రమే
2014 నుంచి 2019 వరకు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు పాతిక శాతం వాటాను రద్దు చేయించలేకపోయారు. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పాతిక శాతం నిధులైనా ఇచ్చారా? అంటే అది లేకుండా పోయింది. మొత్తం ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇచ్చింది కేవలం రూ.రెండు కోట్లు మాత్రమే. అది కూడా జీవో ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప నిధులు మాత్రం మంజూరు చేయలేదు.
నిధులను ప్రభుత్వం అమరావతి రైల్వే లైన్‌కు తరలిస్తోంది
కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైన్‌కు 20 సంవత్సరాల క్రితమే భట్నవిల్లి వరకు పాత భూ సేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి 20 నెలలు అయినా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు 25 శాతం సుమారు రూ.300 కోట్లు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. బడ్జెట్‌లో రైల్వే శాఖ ఇచ్చిన నిధులు అమరావతి రైల్వే లైన్‌కు తరలించుకుపోతోంది.
– గంటి రామ్‌గోపాల్, న్యాయవాది
పేరూరు, అమలాపురం మండలం
కోనసీమ రైలుకు చంద్ర గ్రహణం


