సహకార ఉద్యోగుల సమ్మె బాట
అమలాపురం టౌన్: జిల్లాలోని సహకార ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం, రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడంతో చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సహకార ఉద్యోగుల సమ్మెకు దిగారు. వీరి సమ్మె కారణంగా జిల్లాలోని 166 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సేవలు తొలిరోజు స్తంభించాయి. జిల్లాలోని దాదాపు 450 మంది సహకార ఉద్యోగులు సమ్మెలో పాల్గొని సేవలకు దూరంగా ఉన్నారు. జీవో నంబర్ 36ను అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో వీరు సమ్మె చేపట్టారు. దాదాపు పది డిమాండ్లపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సహకార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తోట వెంకట్రామయ్య, జిల్లా అధ్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు తొలి రోజు సమ్మెను పర్యవేక్షించారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 31 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 31 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ తమ చాంబర్ల నుంచి వేర్వేరుగా పోలీస్ గ్రీవెన్స్‌ను నిర్వహించారు. అర్జీదారులతో వారు ముఖాముఖీ చర్చించి సమస్యలను తెలుసుకున్నారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించినవి ఉన్నాయి.
హాస్టళ్ల పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్
అమలాపురం రూరల్: జిల్లాలో సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆరోగ్య స్థితిగతులు, జీవన ప్రమాణాలు మెరుగుపడేలా టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ మహేష్‌కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి ఉమ్మడి కార్యాచరణ కమిటీని 8 శాఖల అధికారులతో నియమించామన్నారు. ప్రతి శనివారం ఒక సంక్షేమ వసతి గృహాన్ని, ఒక రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసి నివేదిక తన పంపాలన్నారు. పశు సంబంధిత జన ఔషధీ కేంద్రాలు వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఆయన జిల్లా పశు సంవర్ధక శాఖ, జిల్లా సహకార శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పశువుల జన ఔషధ విక్రయ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలపై సమీక్షించారు.
సహకార ఉద్యోగుల సమ్మె బాట


