సర్వం శివోహం | - | Sakshi
Sakshi News home page

సర్వం శివోహం

Feb 16 2026 7:37 AM | Updated on Feb 16 2026 7:37 AM

సర్వం

సర్వం శివోహం

కోటిపల్లి వద్ద గౌతమీ గోదావరి నదిలో

పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు

ఐ.పోలవరం: మహా శివరాత్రి పర్వదినాన జిల్లాలోని శైవ క్షేత్రాలు పంచాక్షరితో మార్మోగాయి. ప్రముఖంగా ద్రాక్షారామలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వర ఆలయం, ఐ.పోలవరం మండలం మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం, కె.గంగవరం మండలం కోటిపల్లి క్షేత్రంలోని ఛాయా సోమేశ్వరస్వామి ఆలయం తదితర క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సమీప నదీ జలాల్లో స్నానాలు చేసి ఆయా క్షేత్రాలలోని స్వామివార్లను దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. లింగోద్భవ కాలాన స్వామి వారికి నదీ జలాలతో అభిషేకాలు చేయగా, భక్తులు శివనామ స్మరణతో జాగరణ చేశారు. అలాగే స్థానిక అధికారులు, ఆలయ కమిటీలు, స్వచ్ఛంద సేవకులు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. దాతలు భక్తులకు ఇతోధికంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

వైభవంగా పుష్కర నదీ జలాభిషేకాలు..

నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం మురమళ్ల శ్రీభద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం. మహా శివరాత్రి పర్వదినాన ఆలయం మహాదేవుని నామాలతో ప్రతిధ్వనించింది. ఐదు రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సుమారు 40 వేల మంది స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ద్వాదశ పుష్కర నదులైన గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి, భీమరథి, పుష్కరిణి, తుంగభద్ర, సింధు, ప్రణీత జలాలతో ఆలయ పండితులు నాగభట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు యనమండ్ర సత్యసీతారామ శర్మ, యనమండ్ర సుబ్బారావు, పేటేటి శ్యామల కుమార్‌ పర్యవేక్షణలో వీరేశ్వరునికి అభిషేకాలు చేశారు. ఈ అభిషేకాన్ని తిలకించేందుకు జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. తొలుత ద్వాదశ పుష్కర నదీ జలాలతో గ్రామోత్సవం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ, లక్ష పత్రి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం కేవలం మహా శివరాత్రికి మాత్రమే అలంకరించే నాగాభరణాన్ని స్వామివారికి తొడిగారు. సాయంత్రం మేళతాళాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో నందాదీపం మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ చైర్మన్‌ దాట్ల రామకృష్ణంరాజు, ఈఓ వి.సత్యనారాయణ, దేవదాయ శాఖ తనిఖీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

భీమేశ్వర దర్శనం.. బంధ విమోచనం..

రామచంద్రపురం రూరల్‌: పంచారామాలలో ఒకటిగా.. త్రిలింగ క్షేత్రాలలో ప్రముఖమైనదిగా.. అష్టాదశ శక్తి పీఠాలలో 12వదిగా విరాజిల్లుతున్న స్థానిక ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తజన సంద్రమైంది. ఆలయ ప్రాంగణం అంతా హరనామ స్మరణతో ప్రతిధ్వనించింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. తెల్లవారు జామునుంచే సప్త గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. 33 మట్టి కుండలతో అభిషేక ద్రవ్యాలు, సప్త నదీ జలాలు, 12 గుండాలు నుంచి సేకరించిన జలాలతో స్వామికి తొలి అభిషేకం చేశారు. అనంతరం ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టెంట్లలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు.

‘కోటిఫల’ ప్రాప్తిరస్తు..

కె.గంగవరం: మండలంలోని కోటిపల్లి క్షేత్రంలోని ఛాయా సోమేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి గౌతమీ గోదావరిలో పుణ్య స్నానాలు చేసి స్వామివారి దర్శించుకున్నారు. తీర్థపు బిందెలతో గోదావరి జలాలను తీసుకువచ్చిన అర్చకులు స్వామివారికి అభిషేకించి అనంతరం దర్శనాలు కల్పించారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం టెంట్లు, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. సుమారు లక్షకు పైగా భక్తులు దర్శించుకున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. సుమారు 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించగా, వైద్యులు శిబిరాల ఏర్పాటు చేశారు. స్వామి వారిని ఆర్డీఓ అఖిల, ఎంపీపీ పంపన నాగమణి, సుబ్బారావు దంపతులు దర్శించుకున్నారు. భక్తులకు పైండా సత్రం, ఆర్య వైశ్య సంఘం, కమ్మ సంఘం, అల్లూరి వంశీయులు, సత్యసాయి సేవ సంస్థలు, విశ్వ చైతన్య శక్తి చారిటబుల్‌ ట్రస్ట్‌, పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానాలు ఏర్పాటు చేశాయి. కె.గంగవరం నుంచి కోటిపల్లి వరకు దారిపొడవునా దాతలు పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు.

భక్తులతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు

అభిషేక ప్రియుడికి విరివిగా

పంచామృతాభిషేకాలు

ఏర్పాట్లు చేసిన అధికారులు,

ఆలయ కమిటీలు

భక్తుల సేవలో తరించిన

స్వచ్ఛంద సంస్థలు, దాతలు

సర్వం శివోహం1
1/1

సర్వం శివోహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement