రేపు ఉపాధ్యాయుల రణభేరి 2.0 | - | Sakshi
Sakshi News home page

రేపు ఉపాధ్యాయుల రణభేరి 2.0

Feb 16 2026 7:37 AM | Updated on Feb 16 2026 7:37 AM

రేపు ఉపాధ్యాయుల  రణభేరి 2.0

రేపు ఉపాధ్యాయుల రణభేరి 2.0

అమలాపురం టౌన్‌: కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తవుతున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రణభేరి 2.0 ద్వారా నిరసన తెలియజేయనున్నారు. విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద 17వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు యూటీఎ్‌ఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవీ రమణ, టీవీఏఎస్‌ సుబ్బారావు తెలిపారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహిస్తున్న క్రమంలో జిల్లా నుంచి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. పీఆర్సీ నియమించి ఐఆర్‌ ప్రకటించాలని, నాలుగు డీఏలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని వారు పేర్కొన్నారు. అలాగే పెండింగ్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని, హెల్త్‌ కార్డులు, మెడికల్‌ బిల్లుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్లపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రమణ తెలిపారు.

నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌

అమలాపురం రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్‌ (పీజీఆర్‌ఎస్‌) సోమవారం యథావిధిగా కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ తెలిపారు. అర్జీదారులు ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయితో పాటు మూడు రెవెన్యూ డివిజన్‌ అధికారుల కార్యాలయాల్లో మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కార్యాలయాల్లో గ్రీవెన్స్‌ జరుగుతుందన్నారు.

ఉత్సాహంగా ఏఎస్సార్‌

జాతీయ వాలీబాల్‌ పోటీలు

ఉప్పలగుప్తం: మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని గొల్లవిల్లిలో భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఏఎస్‌ఆర్‌ (అరిగెల శ్రీరంగయ్య) టోర్నమెంట్‌ మెన్‌, వుమెన్‌ జాతీయ స్థాయి డే అండ్‌ నైట్‌ వాలీబాల్‌ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, టోర్నమెంటు గౌరవ అధ్యక్షుడు అయితాబత్తుల ఆనందరావు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, టోర్నీ అధ్యక్షుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, ముఖ్య సలహాదారు అరిగెల నానాజీ ఆదివారం ఈ పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు మెదటి మ్యాచ్‌లో జీఎస్‌టీ ముంబై, ఎస్‌ఏఐ కేరళ జట్టుపై జీఎస్టీ ముంబై జట్టు విజేతగా నిలిచింది. రెండో మ్యాచ్‌లో ఆల్ఫోన్సో కేరళ, ఎస్‌సీఆర్‌ మహిళా జట్లు తలపడ్డాయి. మూడో మ్యాచ్‌లో ఇండియన్‌ బ్యాంక్‌ చైన్నె, కర్ణాటక జట్లు తలపడ్డాయి.

రత్నగిరిపై రద్దీ

అన్నవరం: మహాశివరాత్రి పర్వదినం, ఆదివారం కలసి రావడంతో రత్నగిరికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. దీంతో, సత్యదేవుని ఆలయ ప్రాంగణం, క్యూలు, వ్రత, విశ్రాంతి మండపాలు రద్దీగా మారాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సత్యదేవుని రథ సేవను ఉదయం టేకు రథంపై ఘనంగా నిర్వహించారు.

జేఎన్‌టీయూకే విద్యార్థిని ఆత్మహత్య

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూకే ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ కెమికల్‌ ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతూ.. కళాశాల ఆవరణలోని నాగవళి హాస్టల్‌లో ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం తన గది నుంచి ఆమె ఎంతకూ బయటకు రాలేదు. దీంతో, తోటి విద్యార్థులు వెళ్లి చూడగా గదిలో తాడుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి, హాస్టల్‌ అధికారులకు ఈ విషయం చెప్పారు. దీంతో, అధికారులు సర్పవరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గదిలో లభించిన ఆధారాలు, లేఖల ఆధారంగా అరుణ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement