పరిపాలనాదక్షుడు సంజీవయ్య
అమలాపురం రూరల్: భారతదేశపు మొట్ట మొదటి దళిత ముఖ్యమంత్రిగా, నిరాడంబరమైన వ్యక్తిగా దామోదరం సంజీవయ్య గుర్తింపు పొందారని జిల్లా రెవెన్యూ అధికారి కొత్త మాధవి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలను సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ సంజీవయ్య పరిపాలనాదక్షుడిగా గుర్తింపు పొందారన్నారు. దేశంలో తొలిసారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏర్పాటు చేశారన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత శాఖ అధికారిని పి.జ్యోతిలక్ష్మి దేవి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి సాధనప్రసాద్, కలెక్టరేట్ పరిపాలనాధికారి కడలి కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
నిజాయితీ గల నేత
అమలాపురం టౌన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య నిరాడంబర రాజకీయ వేత్తే కాకుండా నిజాయితీ గల నేతని ఎస్పీ రాహుల్ మీనా గుర్తు చేశారు. దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన జయంతి కార్యక్రమంలో ఎస్పీ మీనా మాట్లాడారు. తొలుత సంజీవయ్య చిత్రపటానికి జిల్లా ఎస్పీతో పాటు ఎస్పీ కార్యాలయ సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంజీవయ్య జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని ఎస్పీ పేర్కొన్నారు. బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అజరామరమని స్పష్టం చేశారు.


