ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్–12 క్రికెట్ జట్టులో అమలాపురానికి చెందిన 7వ తరగతి విద్యార్థి సబ్బెళ్ల విశ్వఫణీందర్ రెడ్డి బ్యాట్స్ మెన్‌గా ఎంపికయ్యాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో ఇటీవల జరిగిన ఎంపికలో అతను ప్రతిభ చాటాడు. ఈ ఎంపికల్లో దాదాపు 300 మంది పాల్గొనగా, 18 మందిని మాత్రమే జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. అందులో విశ్వఫణీందర్‌రెడ్డి ఒకరు. ఉమ్మడి జిల్లా జట్టు ఈ నెల 16 నుంచి 19 వరకూ విజయనగరంలో జరిగే నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడనుంది. అమలాపురం సీటీఓ కార్యాలయంలో ఫణీందర్‌రెడ్డి తండ్రి సాయికుమార్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన కుమారుడు చిన్నతనం నుంచి క్రికెట్ పట్ల ఆసక్తి చూపుతూ ప్రతిభ చాటుతుండడంతో రోజూ ఉదయాన్నే దగ్గరుండి కోచింగ్ ఇప్పించారు. ఫణీందర్‌రెడ్డి స్థానిక సర్ సీవీ రామన్ స్కూల్‌లో చదువుతున్నాడు. ఆ విద్యార్థిని, అతనికి శిక్షణ ఇచ్చిన కోచ్‌లను స్కూల్ డైరెక్టర్ రవణం వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ సురేష్‌కుమార్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.
మనోహరం..
ఉమా కొప్పేశ్వరుల కల్యాణం
కొత్తపేట: భక్తుల హరహర మహాదేవ శంభోశంకర నామస్మరణ.. వేద పండితుల సుస్వర మంత్ర పఠనాలు.. ప్రతి ఘట్టాన్ని గుర్తు చేసేలా మంగళ వాయిద్యాలు.. సుగంధ భరిత పుష్పమాలికలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదిక.. దానిపై పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు ధరించి, బుగ్గన చుక్కతో వరుడిగా మెరిసిపోతున్న స్వామివారు, ఆ పక్కనే వధువుగా కొలువుదీరిన అమ్మవారు.. ఒక్కమాటలో చెప్పాలంటే పార్వతీదేవితో పరమేశ్వరుని కల్యాణ మహోత్సవం జరిగిన వేళ పురాణ ప్రసిద్ధి చెందిన పలివెల క్షేత్రం దేదీప్యమానంగా వెలిగిపోయింది. వందలాదిగా తరలివచ్చిన భక్తులు ఉమా కొప్పేశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి పులకించిపోయారు. రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో కొత్తపేట మండలం పలివెల ఒకటి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శివ పార్వతులు ఏకపీఠంపై కొలువైన క్షేత్రంగా స్థల పురాణంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దేవదాయ – ధర్మదాయ శాఖ జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో దేవస్థానం ఈఓ కామేశ్వరరావు ఆధ్వర్యంలో మహా శివరాత్రి ఉత్సవాలు శునివారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తెల్లవారుజామున ఆలయంలో కల్యాణమూర్తులైన ఉమా కొప్పేశ్వరులను అర్చకులు, వేద పండితులు ప్రాంగణంలో రాజరాజనరేంద్రుడు నిర్మించిన కల్యాణ మండపంలోకి తీసుకువచ్చారు. పలువురు స్థానిక ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. దేవస్థానం తరఫున ఈఓ కామేశ్వరరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. 4.05 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి ఘట్టాన్ని పండితులు తమ వ్యాఖ్యానం ద్వారా కళ్లకు కట్టినట్టు వివరించారు. అనంతరం భక్తులకు కల్యాణ తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక


