కంటైనర్ కిందకు దూసుకుపోయిన స్కూటీ
యువకుడి మృతి, మరో ఇద్దరికి గాయాలు
తాళ్లరేవు: జాతీయ రహదారి 216లో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. రెండు రోజుల క్రితం ఇదే జాతీయ రహదారిలో పోలేకుర్రు చెక్‌పోస్టు వద్ద టిప్పర్ కింద పడి ఎంబీఏ విద్యార్థిని మృతి చెందిన ఘటన మరువక ముందే, పటవల వద్ద మరో ప్రమాదం చోటు చేసుకోవడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ కథనం ప్రకారం.. యానాం శివారు సావిత్రినగర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు స్కూటీపై కాకినాడకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ప్రమాదవశాత్తూ స్కూటీ కంటైనర్ కిందకు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఓలేటి కృష్ణ (20) మృతి చెందగా, ధర్మాడి మణికంఠ, సంగాని ప్రసాద్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. జాతీయ రహదారి చెంతన పటవల గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న రొయ్యల కంపెనీకి చెందిన కంటైనర్ అకస్మాత్తుగా తిరగడంతో, యువకులు స్కూటీని అదుపు చేయలేక ఒక్కసారిగా కంటైనర్ కిందకు దూసుకుపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనతో సావిత్రినగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కోరంగి ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కంటైనర్ కిందకు దూసుకుపోయిన స్కూటీ


