నైపుణ్యం వెలికి తీసేందుకు శాప్ లీగ్ పోటీలు
ఐ.పోలవరం: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతిభగల యువ క్రీడాకారులను (బాలురు, బాలికలు) గుర్తించి వారిలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సమితి (శాప్) ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తోందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి.ఆర్.రుద్ర తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి నెల మంగళవారం క్రీడా పోటీలు నిర్వహించేందుకు శాప్ లీగ్స్ స్పోర్ట్స్ క్యాలెండర్ –2026ను విడుదల చేసిందన్నారు. 31 క్రీడాంశాలలో ఈ లీగ్ పోటీలు జిలా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు శాప్ ప్రత్యేక శిక్షణ అందించి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు.
చదరంగం అండర్–13, 15, 17 – 19, సైక్లింగ్ అండర్–18 జూనియర్స్, మాస్టర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో ఈ నెల 17న చదరంగం, 24న సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలైన చెస్ క్రీడాకారులను ఫిబ్రవరి 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. సైక్లింగ్ విభాగంలో గెలుపొందిన క్రీడాకారులను ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని వెల్లడించారు. పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు తప్పనిసరిగా శాప్ వెబ్‌సైట్‌లో జిల్లా, క్రీడా విభాగం, కేటగిరీ వారీగా ఓపెన్ రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. నమోదు చేసుకున్న క్రీడాకారులకే పోటీలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. గెలుపొందిన వారికి క్రీడా యాప్ ద్వారా ధ్రువపత్రాలు జారీ చేస్తామని రుద్ర తెలిపారు.


