భార్య ఆత్మహత్య కేసులో వ్యక్తి అరెస్ట్
కాకినాడ క్రైం: మనస్తాపంతో ఈ నెల 2న ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల ప్రకారం.. అనుమలశెట్టి లక్ష్మీదీప్తి (36), తన భర్త జగదీష్ కుమార్‌తో కలసి తణుకులో నివాసం ఉంటోంది. భర్త బాధ్యతా రాహిత్యం, మరో వివాహం చేసుకున్నాడనే ఆరోపణలు, అప్పుల నేపథ్యంలో నిత్యం గొడవలు జరుగుతుండేవి. దీంతో లక్ష్మీదీప్తి మనస్తాపం చెంది కాకినాడ రామారావుపేటలోని పుట్టింటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 2న ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు, కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జగదీష్‌ను గురువారం అరెస్టు చేశారు.
సూసైడ్ నోట్ రాసి వ్యక్తి అదృశ్యం
సీతానగరం: తనకు అప్పులు ఉన్నాయని ఇంట్లో సరిగ్గా చూడడం లేదని, సూసైడ్ నోట్ రాసి తన భర్త కుమ్మరి కృపానందం ఎక్కడికో వెళ్లిపోయాడని అమూల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై డి.రామ్‌కుమార్ గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 10న ఉదయం రఘుదేవపురం గ్రామానికి చెందిన కృపానందం (36) ఇంట్లో సూసైట్ నోట్ పెట్టి బయటకు వెళ్లిపోయాడు. ఆ నోట్‌లో అప్పులు ఎక్కువగా ఉన్నాయని ఇంట్లో తనను సరిగా చూడటం లేదని, రెండు మొక్కులు ఉన్నాయని, వాటిని తీర్చి చనిపోతానని కృపానందం రాశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఒంటిపై గ్రీన్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని ఆచూకీ తెలిసిన వారు కోరుకొండ సీఐ 94409 04829, సీతానగరం ఎస్సై 94409 04832 నంబర్లకు తెలపాలని ఎస్సై వివరించారు.
‘నన్నయ’లో షార్ట్ టర్మ్ ఆఫ్ లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఏపీఎస్‌ఎస్‌డీసీ సహకారంతో స్కిల్ డెవలప్‌మెంట్ షార్ట్ టర్మ్ ఆఫ్ లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ఈ నెల 16 నుంచి 20 వరకూ నిర్వహించనున్నామని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను గురువారం ఆమె విడుదల చేశారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో చదువుతున్న బీఈడీ, ఎమ్మెస్సీ విద్యార్థులందరికీ ఉచితమన్నారు. త్వరలో కంప్యూటర్ ఫండమెంటల్స్, సర్టిఫికెట్ ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్, ఆప్టిట్యూడ్, టేలీ, సర్టిఫికెట్ ఇన్ మిషన్ లెర్నింగ్, డేటా ఎనలిటిక్స్, పైతొన్, గ్రాఫిక్ డిజైన్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఆచార్య బి.జగన్‌మోహన్‌రెడ్డి, డాక్టర్ ఎ.శ్రీరామచంద్రమూర్తి, ట్రైనర్ జి.సౌజన్య పాల్గొన్నారు.
వీఆర్వో ఆత్మహత్యాయత్నం
గొల్లప్రోలు (పిఠాపురం): గొల్లప్రోలు మండల తహసీల్దార్ వేధిస్తున్నారంటూ ఓ వీఆర్వో కార్యాలయం ముందే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన గురువారం గొల్లప్రోలులో కలకలం రేపింది. బాధితుడు, స్థానికుల కథనం ప్రకారం.. గొల్లప్రోలు నగర పంచాయతీ 6వ సచివాలయంలో పరమేశ్వరరాజు వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ రామ్‌కుమార్ తనపై పని ఒత్తిడి పెంచుతూ మానసికంగా హింసిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా సచివాలయ విధులతో పాటు అదనంగా దుర్గాడ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. ఎంత చెప్పినా వినకుండా తనపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపిస్తూ పరమేశ్వరరాజు గురువారం తహసీల్దార్ కార్యాలయం బయట నిద్రమాత్రలు మింగారు. గమనించిన తోటి సిబ్బంది, స్థానికులు వెంటనే ఆయనను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500
కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
గండేరా (వెయ్యి) 31,500
గటగట (వెయ్యి) 29,000
కురిడీ కొబ్బరి (కొత్తవి)
గండేరా (వెయ్యి) 29,500
గటగట (వెయ్యి) 27,000
నీటికాయ
పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000
కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)19,000 – 20,000
కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000
కిలో 400
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
భార్య ఆత్మహత్య కేసులో వ్యక్తి అరెస్ట్


