అగ్గి.. సర్వం బుగ్గి
● మామిడికుదురులో 11 తాటాకిళ్లు దగ్ధం
● రోడ్డున పడ్డ బడుగుజీవులు
ప్రమాదంలో కాలిపోయిన తాటాకు ఇళ్లు
సర్వం కోల్పోయి దిగాలు చెందుతున్న బాధితులు
మామిడికుదురు: అనుకోని అగ్ని ప్రమాదం ఆ కుటుంబాలను రోడ్డున పడేసింది.. ఉన్న గూడును బుగ్గి చేసింది.. మామిడికుదురు ఆల్‌క్యాస్ట్ కాలనీలో గురువారం 11 తాటాకిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం 14 కుటుంబాలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాయి. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారుల ప్రాథమిక అంచనా వేశారు. ఆరుగాలం శ్రమిస్తూ రెక్కాడితే కానీ డొక్కాడని నిరు పేద కుటుంబాలు ఈ ప్రమాదంలో అన్నీ కోల్పోయాయి. గ్యాస్ సిలెండర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రాజోలు అగ్నిమాపక కేంద్రం అధికారి కేఎన్‌వీ రమణ ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. డిగ్రీ చదువుకున్న తమ సర్టిఫికెట్లు ప్రమాదంలో కాలిపోయాయని జల్లి నాగరాజు, కల్లి దుర్గాప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులకు మామిడికుదురు జెడ్పీహెచ్ స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, తహసీల్దార్ పి.సునీల్‌కుమార్, ఎంపీడీఓ జి.భవాని, ఎంఈఓ మోకా వెంకన్నబాబు, సర్పంచ్ గౌస్ మొహిద్దీన్ తదితరులు బాధితులను పరామర్శించారు.
అగ్గి.. సర్వం బుగ్గి


