తిమ్మాపురంలో మూగజీవాల మృతి
కాకినాడ రూరల్: తిమ్మాపురం గ్రామంలో మూగజీవాలు అనుమానాస్పదంగా మృతి చెందడంపై తిమ్మాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడి పెదపూడి శ్రీరామకృష్ణకు చెందిన మకాంలో మూడు గేదెలు, ఒక ఆవు గురువారం మృతి చెందాయి. దీనిపై విచారణ జరపాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై గణేష్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన గేదెలు, ఆవుల విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. దీనిపై తిమ్మాపురం పశు వైద్యురాలు వి.సుధ మాట్లాడుతూ తమకు సమాచారం వచ్చిన వెంటనే పశువుల మకాం వద్దకు చేరుకున్నామని, అప్పటికే రెండు చనిపోయాయని, మరో రెండింటికి వైద్యం చేసినప్పటికీ ప్రాణాలు నిలవలేదన్నారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తెలుస్తుందన్నారు. కరప ఏడీ సురేష్‌బాబు, ఆర్‌ఏడీడీఎల్ వైద్యుడు సందీప్ పర్యవేక్షణలో పీఎం నిర్వహించామన్నారు.


