నమ్మించి.. దోచేసి..
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
కోరుకొండ: ఓ ఇంట్లో పనికి చేరారు.. ఎంతో నమ్మకంగా ఉన్నారు.. అత్యాశకు పోయి, చోరీ చేసి చివరికి కటకటాల పాలయ్యారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో ఈ ఘటన జరిగింది. దీనిపై గురువారం కోరుకొండ పోలీస్ స్టేషన్‌లో నార్త్‌జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన కథనం ప్రకారం.. శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన సర్పంచ్ మద్దాల అమ్మాజీ ఇంట్లో సరకనం జగత్ కొండలరావు, దండు అనిల్‌కుమార్‌లు పని చేస్తున్నారు. ఎంతో నమ్మకంగా ఉండేవారు. ఇదిలా ఉంటే ఆ ఇంట్లో ఈ నెల 10న దొంగతనం జరిగింది. 92 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.లక్ష చోరీకి గురయ్యాయి. దీనిపై సర్పంచ్ భర్త మద్దాల రమణ కోరుకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంట్లో, పరిసరాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. దాని ఆధారంగా అనుమానం వచ్చి జగత్‌కొండలరావు, అనిల్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఆభరణాలను రికవరీ చేశారు. ఆ ఇద్దరినీ కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్ విధించింది. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన ఎస్సై శ్రీనివాస్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ ఎస్‌వీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


