హోంగార్డు ఇంట్లో రూ.4.45 లక్షల సొత్తు చోరీ
బిక్కవోలులో
చోరీ జరిగిన
ఇంటిని
పరిశీలిస్తున్న
అనపర్తి
సీఐ సుమంత్, కానిస్టేబుళ్లు
అనపర్తి: బిక్కవోలులోని హోంగార్డు ఇంట్లోకి దొంగలు పడి నగలు, నగదు చోరీ చేశారు. ఎస్సై వి.రవిచంద్ర కుమార్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. జి.మామిడాడ రోడ్డులోని లక్ష్మీనారాయణస్వామి ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న ఉర్లంకుల సత్యకృష్ణ ప్రసాద్ కాకినాడలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్ద హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన ఇంట్లోకి సోమవారం అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో దొంగలు చొరపడ్డారు. ప్రధాన ద్వారం తాళాన్ని పగులగొట్టి లోపలకు వచ్చారు. ఇంట్లోని ఇనుప బీరువాను పగులకొట్టి రూ.4,10 లక్షలు, 14 గ్రాముల బంగారం కలిపి సుమారు రూ.4.45 లక్షల విలువైన సొత్తును చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలాన్ని అనపర్తి సీఐ వీఎల్‌వీకే సుమంత్ పరిశీలించారు.


