వక్ఫ్ భూములపై చంద్రబాబు ప్రభుత్వం కుట్
అమలాపురం రూరల్: వక్ఫ్ బోర్డుకు చెందిన భూములను ప్రభుత్వ భూములుగా చంద్రబాబు సర్కారు మార్చిందని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని 71.57 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములను ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండానే, నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ ఆన్‌లైన్ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా మార్చారని పేర్కొన్నారు. ఇదే విధంగా మంగళగిరి సమీపంలోని మల్లయ్యపాలెంలో 232 ఎకరాల వక్ఫ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. అమరావతి సీఆర్‌డీఏ పరిధిలోకి ఈ భూములను తీసుకువచ్చి, టీడీపీకి అనుకూలంగా ఉండే వర్గాలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వ తీరు వల్ల ముస్లిం సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంలోని ముస్లింలు ఈ విధానాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మైనార్టీ సెల్ నేతలు ఎండీ షరీఫ్, షేక్ ఖాజా బాబు, ఆలీ హుస్సేన్, అజీమ్, యూసుఫ్, అమీర్, ఆసిఫ్ పాల్గొన్నారు.
రేపు జాబ్ మేళా
అమలాపురం రూరల్: నిరుద్యోగ యువతకు పరిశ్రమలు సేవా రంగాల సమన్వయంతో ఉద్యోగ అవకాశాల కల్పనకు బుధవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి కే. మాధవి తెలిపారు. సోమవారం ఆమె ప్రచార వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో 10 కంపెనీల మానవ వనరుల ప్రతినిధులు పాల్గొని 550 ఖాళీలను భర్తీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు అందిస్తారని ఆమె చెప్పారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటీఐ పూర్తి చేసినవారు పాల్గొనవచ్చన్నారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి. మమ్మీ, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు, జిల్లా వికాస మేనేజర్ గోళ్ళ రమేష్, రావి ఫౌండేషన్ కార్యదర్శి పాలగుమ్మి వెంకటకృష్ణ పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 33 అర్జీలు
అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 33 అర్జీలు వచ్చాయి. అమలాపురం డీఎీస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఎస్పీ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్‌ను నిర్వహించారు. అర్జీలను పరిశీలించిన డీఎస్సీ ఆయా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి సీఐలు, ఎస్సైలతో మాట్లాడి గ్రీవెన్స్‌కు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
11, 12 తేదీలలో దివ్యాంగుల
సాంస్కృతిక ఉత్సవాలు
ముమ్మిడివరం: జిల్లాలో ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న దివ్యాంగులకు ఈ నెల 11, 12 తేదీలలో అమలాపురం అంబేడ్కర్ భవన్‌లో ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్షా అదనపు పథక సంచాలకులు, డిప్యూటీ కలెక్టర్ జి.మమ్మీ తెలిపారు. సమగ్ర శిక్షా, సహిత విద్య ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించినవన్నారు.


