తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం
హిందువుల మనోభావాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలు
ఆత్రేయపురం : మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక సీఎం చంద్రబాబు హిందువులకు అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై నిర్ధారణ లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. ఆయన సోమవా రం పార్టీ అమలాపురం పార్లమెంటరీ ఇనచార్జి జక్కంపూడి విజయలక్ష్మితో కలసి ఆత్రేయపురం అల్లూరి సీతారామరాజు సెంటర్లో విలేకరులతో మాట్లాడారు. హిందువుల మనోభావాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుకుంటోందని, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ఆలవాలమైన తిరుమలలో లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రసారం నీచ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. సుప్రీంకోర్టు వాస్తవాలు చెప్పినా మరింత దిగజారి శ్రీశైలం మల్లికార్జునస్వామి లడ్డూ ప్రసాదంపై కూడా ఆరోపణలు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ అసత్య ప్రచారాలను నిలిపివేసి స్వామివారి ప్రసాదంపై ప్రజల్లో ఉన్న అపారమైన విశ్వాసాన్ని కాపాడాలని, లేకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు అత్యున్నత న్యాయస్థానం తీర్పులను సైతం లెక్క చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి, ప్రజలను భయానికి గురి చేస్తున్నారని అన్నారు. హెరిటేజ్ పాలల్లో కొవ్వు శాతం తగ్గిందని వచ్చిన నివేదికలపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చిలువూరి రామకృష్ణంరాజు, వైఎస్సార్ సీపీ నాయకులు మార్గాని గంగాధర్, చల్లా ప్రభాకరరావు, కప్పల శ్రీధర్, కనుమూరి శ్రీను రాజు, తమ్మన శ్రీను, నానాజీ, గొట్టుముక్కల గోపి రాజు, ముదునూరి బండ కృష్ణంరాజు, వేగేశ్న గోపాలం, సరెళ్ల ధనలక్ష్మి పాల్గొన్నారు.


