సైబర్ మోసాల నివారణకు చర్యలు
ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్
అమలాపురం రూరల్: ఇటీవల కాలంలో జరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. అమలాపురం రూరల్ సీఐ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలసి బుధవారం ఆయన తనిఖీ చేశారు. అక్కడ ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో సీబీఐ డిజిటల్ అరెస్టుల పేరుతో జరిగే సైబర్ మోసాలు తగ్గినట్లు తెలిపారు. దీనిలో ఓ ముఠాను అరెస్టు చేశామని అన్నారు. ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులను లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, వీటిపై బ్యాంకు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి డిపాజిట్లు విత్ డ్రాల్లో జాగ్రత్తలు పాటించాలని ఆదేశించామని అన్నారు. జిల్లా కేంద్రంలో సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. డీఎస్పీ టీఎస్‌ఆర్ కె.ప్రసాద్, సీఐ ప్రశాంత్ కుమార్, అమలాపురం తాలూకా ఎస్సై వై.శేఖర్‌బాబు, అల్లవరం, ఉప్పలగుప్తం ఎస్సైలు సంపత్‌కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
అయినవిల్లి పోలీస్ స్టేషన్‌లో..
అయినవిల్లి: వార్షిక తనిఖీల్లో భాగంగా అయినవిల్లి పోలీస్ స్టేషన్‌లో రికార్డులను ఐజీ అశోక్‌కుమార్ పరిశీలించారు. ఇటీవల సంక్రాంతి సంబరాలు, ప్రభల ఉత్సవాలు, అంతర్వేది నరసన్న తీర్థ మహోత్సవాలు ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసు బందోబస్తు నిర్వహించారన్నారు. శివరాత్రి మహోత్సవాల్లో వివాదాలకు తావులేకుండా ఇప్పటికే పోలీసు శాఖ అప్రమత్తమైందన్నారు. అభ్యంతరం లేని పోస్టులు మాత్రమే సోషల్ మీడియాలో పెట్టాలన్నారు. ఈ పోస్టుల కారణంగా ఏ వివాదం జరిగినా నిందితులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. హాస్టళ్లలో విద్యార్థులను వారి అనుమతులు ప్రకారమే తీసుకెళ్లాలన్నారు. మైనర్లకు మోటార్ సైకిళ్లను ఇవ్వరాదన్నారు. మద్యం తాగి, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని అశోక్‌కుమార్ సూచించారు.


