అక్రమంగా అధిక ఛార్జీ వసూలు! | Microsoft Faces 1 7 Billion euro UK Antitrust Class Action | Sakshi
Sakshi News home page

అక్రమంగా అధిక ఛార్జీ వసూలు!

Apr 22 2026 4:24 PM | Updated on Apr 22 2026 4:33 PM

Microsoft Faces 1 7 Billion euro UK Antitrust Class Action

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు అంతర్జాతీయ స్థాయిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్లో తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ పోటీ సంస్థలను దెబ్బతీసేలా వ్యవహరించిందన్న ఆరోపణలపై యూకేలో దాఖలైన ‘క్లాస్ యాక్షన్’ దావాను విచారించేందుకు లండన్ కోర్టు పచ్చజెండా ఊపింది. ఈ కేసులో మైక్రోసాఫ్ట్ ఓడిపోతే సుమారు 1.7 బిలియన్‌ యూరోలు (సుమారు రూ.18,700 కోట్లు) భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ఏమిటీ వివాదం?

మైక్రోసాఫ్ట్ తన విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, అజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే వ్యాపార సంస్థల నుంచి అక్రమంగా అధిక ఛార్జీలు వసూలు చేసిందనేది ప్రధాన ఆరోపణ. తన మార్కెట్ శక్తిని ఉపయోగించుకుని ఇతర క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు వెళ్లకుండా వినియోగదారులను నియంత్రించిందని హక్కుదారులు వాదిస్తున్నారు.

సుమారు 59,000 బ్రిటీష్ వ్యాపార సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు ఈ దావా పరిధిలోకి వస్తాయి. లండన్‌లోని కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్ (సీఏటీ) న్యాయమూర్తులు ఈ దావాలో పిటిషన్‌దారుల విజయానికి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

నియంత్రణ సంస్థల నిఘా నీడలో..

కేవలం ఈ ప్రైవేట్ దావా మాత్రమే కాకుండా యూకే యాంటీట్రస్ట్ సీఎంఏ ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వ్యాపార పద్ధతులపై లోతైన దర్యాప్తు చేస్తోంది. వర్డ్, ఎక్సెల్ వంటి ప్రసిద్ధ అప్లికేషన్లతో పాటు ఏఐ ఆధారిత కోపైలట్ వంటి ఉత్పత్తుల లైసెన్సింగ్ నిబంధనలు పోటీని అణచివేస్తున్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. సీఏంఏ దర్యాప్తులో సాక్ష్యాలు మైక్రోసాఫ్ట్ తన లైసెన్సింగ్ విధానాల ద్వారా పోటీని వక్రీకరించిందని నిరూపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

మైక్రోసాఫ్ట్ వాదన

ఈ నిర్ణయంపై మైక్రోసాఫ్ట్ అసహనం వ్యక్తం చేసింది. కంపెనీ ప్రతినిధి బుధవారం మాట్లాడుతూ, తాము ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ రోజు వెలువడిన నిర్ణయం కంపెనీపై వస్తున్న ఆరోపణలపై తుది తీర్పు కాదని నొక్కి చెప్పారు.

ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement