ప్రముఖ వాహన తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. ఇండియన్ మార్కెట్ నుంచి A-క్లాస్ సెడాన్, EQA, EQB, EQE SUVలను నిలిపివేసింది. కంపెనీ ఈ నాలుగు మోడళ్లను తన అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా తొలగించింది.
మెర్సిడెస్ బెంజ్.. కొత్త ప్రీమియం కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న నాలుగు మోడల్స్ నిలిపివేసింది. కాగా సంస్థ ఏప్రిల్ 24న మూడవతరం సీఎల్ఏ కారును లాంచ్ చేయనుంది.
మార్చి 2021లో ప్రారంభమైన ఏ-క్లాస్ లిమౌసిన్, గతంలో భారతదేశంలో అత్యంత సరసమైన మెర్సిడెస్-బెంజ్‌గా ఉండేది, దీని ధరలు రూ. 44.46 లక్షల నుంచి రూ. 45.92 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండేవి. దాని ఉత్పత్తి నిలిపివేయడంతో, ఇప్పుడు GLA SUV ఈ స్థానంలోకి చేరనుంది. ఈ కారు ధరలు సుమారు రూ. 51.80 లక్షల నుంచి రూ. 55 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. దీన్నిబట్టి చూస్తే బెంజ్ కారు ప్రారంభ ధర పెరిగినట్లు స్పష్టమవుతోంది.
జీఎల్ఏ కారుకు ఎలక్ట్రిక్ ప్రతిరూపంగా నిలిచిన EQA, భారతదేశంలో మెర్సిడెస్-బెంజ్ యొక్క అత్యంత సరసమైన బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం, దీని ప్రారంభ ధర సుమారు రూ. 66 లక్షలు.
మెర్సిడెస్ బెంజ్ లాంచ్ చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ కారు CLA EV 800-వోల్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది భారతదేశంలో లాంచ్ కానున్న దీని ఎంట్రీ-లెవల్ 85kWh 250+ వెర్షన్, WLTP సైకిల్ ప్రకారం.. సుమారుగా 792 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 272 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల సీఎల్ఏ A 250+ కేవలం 6.7 సెకన్లలో పూర్తిగా ఆగి ఉన్న స్థితి నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు.


