క్విక్‌–కామర్స్‌లో భారత్‌ హవా! | India Online Retail Market Crosses 65 Billion Dollars in 2025 | Sakshi
Sakshi News home page

క్విక్‌–కామర్స్‌లో భారత్‌ హవా!

Apr 12 2026 5:56 AM | Updated on Apr 12 2026 5:56 AM

India Online Retail Market Crosses 65 Billion Dollars in 2025

2025లో 65 బిలియన్‌ డాలర్లు దాటిన ఈ–రిటైల్‌ 

2030 నాటికి 180 బిలియన్‌ డాలర్లకు చేరిక 

బెయిన్‌–ఫ్లిప్‌కార్ట్‌ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌ గణనీయంగా విస్తరిస్తోంది. 2025లో ఈ మాధ్యమం ద్వారా అమ్ముడైన ఉత్పత్తుల స్థూల విలువ (జీఎంవీ) దాదాపు 65–66 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని బెయిన్‌ అండ్‌ కంపెనీ, ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. విలువపరంగా 19–21 శాతం వృద్ధి నమోదైందని రిపోర్టు పేర్కొంది. ఈ క్రమంలో క్విక్‌–కామర్స్‌ విభాగానికి సంబంధించి ప్రపంచంలోనే భారత్‌ అగ్రగామిగా ఎదిగినట్లు వివరించింది.

 ఈ–కామర్స్‌ జీఎంవీలో దాదాపు 16–17 శాతం ఈ క్విక్‌ కామర్స్‌ ద్వారానే వచి్చనట్లు తెలిపింది. ఇది చైనా సహా చాలా మార్కెట్లలో నమోదైన దానికంటే అధికమని వివరించింది. ఆన్‌లైన్‌ షాపింగ్, అందుకోసం చేసే వ్యయం పెరుగుతుండటంతో ఏటా 20 శాతం వృద్ధితో 2030 నాటికి భారత ఈ–రిటైల్‌ మార్కెట్‌ 170–180 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని నివేదిక అంచనా వేసింది. 

రిపోర్టులోని మరిన్ని విశేషాలు.. 
→ స్థూల ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడుతుండటంతో గతేడాది పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందింది. జీఎస్‌టీ కోతలు, ఆదాయ పన్నుపరమైన ఊరట, నెమ్మదిస్తున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల తగ్గింపు తదితర సానుకూలాంశాలతో ప్రైవేట్‌ వినియోగం పెరిగింది. 2022–24 మధ్య 8 శాతంగా ఉన్న ప్రైవేట్‌ వినియోగం 2025లో 10.5 శాతానికి చేరింది. 2026 తొలి త్రైమాసికంలోనూ ఇదే ఊపు కొనసాగడంతో 23–25 శాతం వృద్ధి చెందింది. 

→ గత రెండేళ్లుగా క్విక్‌ కామర్స్‌ విభాగం రెట్టింపయ్యింది. 2025లో ఈ సెగ్మెంట్‌ జీఎంవీ 10–11 బిలియన్‌ డాలర్లకు చేరింది. రాబోయే రోజుల్లో 2030 నాటికి ఇది 65–70 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. అదనంగా నమోదయ్యే ఈ–రిటైల్‌ జీఎంవీలో దీని వాటా 45–50 శాతానికి చేరొచ్చు. అప్పటికి మొత్తం ఆన్‌లైన్‌ షాపింగ్‌లో సంప్రదాయ ఈ–రిటైల్‌ విభాగం వాటా 60–65 శాతంగా ఉండవచ్చు.  

→ అంతర్జాతీయంగా వినియోగానికి భారత్‌ కీలక చోదకంగా నిలుస్తోంది. వచ్చే అయిదేళ్లలో వినియోగంపై అదనంగా వెచి్చంచే ప్రతి 8 డాలర్లలో భారత్‌ వాటా 1 డాలరుగా ఉండనుంది.  

→ గతేడాది ఈ–రిటైల్‌ మార్కెట్‌ భారీగా వృద్ధి చెందినా, ఆఫ్‌లైన్‌ మాధ్యమాన్ని ప్రాధాన్యతను కొట్టిపారేసేందుకు వీలు లేదు. మెజారిటీ వినియోగదారులకు చేరువయ్యేందుకు ఇప్పటికీ ఇది కీలకంగా ఉంటోంది. దీని దన్నుతోనే 2030 నాటికి మొత్తం రిటైల్‌ పరిశ్రమ 1.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోనుంది.  

→ గడిచిన అయిదేళ్లలో భారత్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ మార్కెట్‌ రెట్టింపయ్యింది. షాపింగ్‌ చేసే వారి సంఖ్య 2025లో రెట్టింపయ్యి 29–30 కోట్లకు చేరింది. విక్రేతల వ్యవస్థ విస్తరించడం (గత అయిదేళ్లలో మూడు రెట్లు), భౌగోళికంగా మరిన్ని ప్రాంతాల్లోకి సేవలు అందుబాటులోకి రావడం ఇందుకు దోహదపడుతోంది.  

→ జెన్‌ జెడ్‌ తరం కీలకంగా మారింది. ఈ–రిటైల్‌ షాపర్స్‌లో వీరి వాటా 40–45 శాతంగా ఉంటోంది. 2025లో అదనంగా వచ్చి ఈ–రిటైల్‌ ఆర్డర్లలో 50 శాతం ఈ వర్గం నుంచే వచ్చింది. లైఫ్‌స్టయిల్, బ్యూటీ, ఎల్రక్టానిక్స్‌ తదితర కేటగిరీలవ్యాప్తంగా ఈ విభాగం కస్టమర్ల షాపింగ్‌ ప్రాధాన్యతలు చాలా ప్రత్యేకంగా ఉంటున్నాయి. సోషల్‌ మీడియా, వీడియోలు, ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావం, సత్వర రుణ సదుపాయం వినియోగించుకోవడం ఎక్కువగా ఉంటోంది.  

→ ఇంటర్నెట్‌ యూజర్లలో షాపింగ్‌ చేసే వారి సంఖ్య 25–30 శాతంగానే ఉన్నప్పటికీ (మెట్రోలు/ప్రథమ శ్రేణి నగరాల్లో ఇది 45–50 శాతంగా ఉంది), గతేడాది అదనంగా నమోదైన ఆన్‌లైన్‌ ఆర్డర్లలో ద్వితీయ శ్రేణి నగరాల వాటా దాదాపు 50 శాతంగా ఉంది.  

→ పరిశ్రమ గణనీయంగా ఎదుగుతున్నప్పటికీ భారత్‌లో ఇప్పటికీ ఈ–రిటైల్‌ విస్తరణ చాలా తక్కువగానే జీడీపీలో 1.6 శాతం మాత్రమే ఉంది. అదే చైనాలో 13–14 శాతంగా, ఇండొనేషియాలో 4–4.5 శాతంగా ఉంది. ఇంటర్నెట్‌ యూజర్లలో 30 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు. చైనాలో ఇది 92 శాతంగా, అమెరికాలో 74 శాతంగా ఉంది. ఇవన్నీ భారత్‌లో ఈ రంగం మరింత వృద్ధి చెందడానికి గల అవకాశాలను సూచిస్తున్నాయి.  

→ వచ్చే అయిదేళ్లలో ఈ–రిటైల్‌ మార్కెట్‌ తదుపరి వృద్ధి దశలోకి అడుగుపెట్టనుంది. క్యూ–కామర్స్‌ ఇందుకు దన్నుగా నిలవనుంది. నిత్యావసరాలు, అలాగే డిస్క్రెషనరీ ఉత్పత్తులకు సంబంధించి సౌకర్యవంతమైన మాధ్యమంగా క్యూ–కామర్స్‌ నిలుస్తోంది. ప్రస్తుతం 200 పైగా నగరాల్లో 7,000 పైగా మైక్రో–ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్స్‌ పని చేస్తున్నాయి. భారీ స్థాయిలో కార్యకలాపాల నిర్వహణ వల్ల లాభదాయకత మెరుగుపడింది. అయితే, టాప్‌ మెట్రోలు, ప్రథమ శ్రేణి నగరాల పరిధిని దాటి ఇతర ప్రాంతాల్లో దీని వినియోగం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement