దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ద్విచక్ర, త్రిచక్ర, వాణిజ్య, ప్రయాణిక వాహనాలన్నీ కలిపి రికార్డు స్థాయిలో 2,82,65,519 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024–25లో నమోదైన 2,56,09,399 యూనిట్లతో పోలిస్తే ఇవి 10.4 శాతం అధికం అని వాహన తయారీదారుల సమాఖ్య సియామ్ మంగళవారం తెలిపింది.
జీఎస్‌టీ 2.0 అమలు, ఆర్‌బీఐ రెపో రేట్ల కోతలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయని సియామ్ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)పై వాహన పరిశ్రమ సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసింది. అయితే, పశ్చిమాసియా యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే డిమాండ్, సరఫరా గొలుసు, వాహన ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది.
ముడి చమురు, కమోడిటీ ధరల పెరుగుదల, మారకపు విలువల పెరుగుదల, షిప్పింగ్ మార్గాల్లో అంతరాయాలు ఆటో రంగానికి సవాళ్లుగా ఉన్నాయని తెలిపింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు సద్దుమణిగితే 2026–27లో వాహన రంగం వృద్ధి మరింత వేగం అందుకుంటుందని సియామ్ ఆశాభావం వ్యక్తం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి వాహన ఎగుమతులు 24 శాతం పెరిగి 53,62,884 యూనిట్ల నుంచి 66,47,685 యూనిట్లకు చేరుకున్నాయి.
అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ వృద్ధి సంకేతాలు: సియామ్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ, భారత వాహన పరిశ్రమ బలమైన పునాదులపై నిలబడుతూ వృద్ధిని కొనసాగిస్తోందని సియామ్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్, గ్రామీణ-పట్టణ మార్కెట్లలో కొనుగోలు శక్తి పెరుగుదల, సులభమైన ఫైనాన్సింగ్ విక్రయాలకు ఊతమిస్తున్నాయని చెప్పారు.
జీఎస్‌టీ 2.0 సంస్కరణలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోతలు మార్కెట్లో సానుకూల సెంటిమెంట్‌ను పెంచి పెట్టుబడులు, కొనుగోళ్లను వేగవంతం చేశాయని తెలిపారు. ఎగుమతుల్లో కొన్ని ప్రాంతీయ సవాళ్లు ఉన్నప్పటికీ, ఇతర మార్కెట్లలో భారత వాహనాల డిమాండ్ పెరుగుతుండటం, రూపాయి క్షీణత వల్ల లభిస్తున్న ధరల పోటీ సామర్థ్యం వృద్ధికి తోడ్పడుతున్నాయని వివరించారు.


