ఇన్‌స్టాగ్రామ్‌తో ప్రమాదం.. చిక్కులో ఫేస్‌బుక్‌... యూఎస్‌లో విచారణ

Facebook Prioritised Profit Before Reining In Hate Speech And Instagram Content - Sakshi

టీనేజీ అమ్మాయిలపై ఇన్‌స్టాగ్రామ్‌ చెడు ప్రభావం చూపుతోందంటూ అమెరికాలో చెలరేగిన వివాదం కొత్త మలుపు తీసుకుంది. బలమైన ఆధారాలు ఉన్నందునే ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌పై విమర్శలు వస్తున్నాయనే అంశం తేటతెల్లమవుతోంది. 


సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా ఫేస్‌బుక్‌ ఉంది. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే వాట్సాప్‌, ఇన్‌స్టావంటి పాపులర్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ రన్‌ అవుతున్నాయి. తమ వినియోగదారుల రక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఫేస్‌బుక్‌ నిత్యం ప్రకటనలు చేస్తూనే ఉంటుంది. అంతేకాదు తమ ప్లాట్‌ఫామ్స్‌పై తప్పుడు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తున్నామని చెబుతుంది. అయితే ఇప్పుడవన్నీ కట్టుకథలేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. 


తప్పుడు ప్రచారం
ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఇన్‌స్టాగ్రామ్‌ టీనేజీ అమ్మాయిలపై చెడు ప్రభావం చూపుతోందంటూ ఇటీవల అమెరికాకు చెందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ పట్ల నియంత్రణ లేకపోవడం వల్ల కొందరు టీనేజీ అమ్మాయిలు సూసైడ్‌ దిశగా ఆలోచనలు చేస్తున్నారనేందుకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ప్రకటించింది. అయితే ఫేస్‌బుక్‌ స్పందిస్తూ.. ఇన్‌స్టా గ్రామ్‌ వల్ల టీనేజర్లపై ఎటువంటి ప్రభావం లేదని, పైగా టీనేజీ యూజర్లకు ఎంతో మేలు చేస్తుందంటూ తెలిపింది.

అవన్ని నిజాలే
వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం, ఫేస్‌బుక్‌ స్పందన మీద చర్చ నడుస్తుండగానే ఆదివారం నాడు మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఫేస్‌బుక్‌లో తప్పుడు సమాచారం నిరోధించే విభాగంలో మేనేజర్‌గా పని చేస్తోన్న ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ అనే మహిళా ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె మాట్లాడుతూ తన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు ఫేస్‌బుక్‌ ప్రయత్నిస్తోందంటూ దుయ్యబట్టారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో తప్పుడు సమాచారం, సమాజంపై చెడు ప్రభావం చూపుతున్న వైనానికి సంబంధించిన వివరాలను తానే మీడియాకు అందించినట్టు చెప్పుకున్నారు. జరగిన పొరపాటు సరిదిద్దుకునేందుకు ఫేస్‌బుక్‌ ప్రయత్నించకుండా మరిన్ని తప్పులు చేస్తోందని, అందుకే తాను బయటకు వచ్చినట్టు వెల్లడించారు. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది.

సెనేట్‌ ముందుకు
ఇన్‌స్టాగ్రామ్‌ టీనేజీ అమ్మాయిలపై ఎటువంటి దుష్‌పరిణామాలు కలిగిస్తుందో సవివరింగా తెలియజేస్తూ ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ ‘ప్రొటెక్టింగ్‌ కిడ్స్‌ ఆన్‌లైన్’ పేరుతో సమగ్ర నివేదికను రూపొందించారు. మంగళవారం ఆమె ఈ నివేదికను సెనెట్‌ సభ్యులకు అందించే అవకాశం ఉంది. ఇందులో వివరాలు కనుక పక్కా ఆధారాలతో ఉంటే ఫేస్‌బుక్‌ చిక్కుల్లో పడటం ఖాయం. 

లాభాలే ముఖ్యం
టెలివిజన్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రాన్సెస్‌ మాట్లాడుతూ సమాజానికి మంచి చేయాలా ? లేక ఫేస్‌బుక్‌కి మంచి జరగాలా అనే విషయంలో అక్కడ సందిగ్ధం నెలకొందని, చివరకు ఫేస్‌బుక్‌ లాభాల వైపే మొగ్గు చూపడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

గతంలో
అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కూడా ఫేస్‌బుక్‌ వ్యవహార శైలి వివాస్పదమైంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకంగా ఉన్నాయంటూ ట్విట్టర్‌ పేర్కొనగా ఆ పని ఫేస్‌బుక్‌ చేయలేదు. పైగా అలా చేయడాన్ని సమర్థించుకుంది కూడా. ఈ అంశంలో అంతర్జాతీయ సమాజం నుంచి ఫేస్‌బుక్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. 

చదవండి: కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్‌.. సెబీ సీరియస్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top