చైనాలో కుప్పకూలిన రియల్‌ ఎస్టేట్‌ | China Real Estate Crash: Why China's Housing Market Is Collapsing? Is India Next? | Sakshi
Sakshi News home page

చైనాలో కుప్పకూలిన రియల్‌ ఎస్టేట్‌

Apr 30 2026 4:07 PM | Updated on Apr 30 2026 4:18 PM

China Real Estate Crash: Why China's Housing Market Is Collapsing? Is India Next?

చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం (China Real Estate Crash) ముదురుతోంది. ఒకప్పుడు దేశ జీడీపీలో పావు వంతు (25%) వాటా కలిగిన ఈ రంగం, ప్రస్తుతం కుప్పకూలుతోంది. గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా ఆస్తి విలువలు పడిపోవడంతో అటు ఇన్వెస్టర్లు, ఇటు సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇదే తరహా ‘రియల్’ ప్రకంపనలు భారతదేశంలోనూ వచ్చే అవకాశం ఉందా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?
బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) డేటా ప్రకారం, చైనాలో రియల్ ఎస్టేట్ పతనం "స్లో మోషన్ క్రాష్‌"ను తలపిస్తోంది. 2021లో 113 పాయింట్లుగా ఉన్న గృహ ధరల సూచిక, 2025 చివరి నాటికి 86.79కి పడిపోయింది. అంటే నాలుగేళ్లలో దాదాపు 25% సంపద ఆవిరైపోయింది. చైనాలో ప్రస్తుతం 391 మిలియన్ చదరపు మీటర్ల మేర ఇళ్లు అమ్ముడుపోకుండా ఖాళీగా ఉన్నాయి. ఇది 2021తో పోలిస్తే 72% ఎక్కువ. 2025 మొదటి పది నెలల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 14.7% క్షీణించాయి.

దిగ్గజ సంస్థల పతనం
చైనాలో రియల్ ఎస్టేట్ దిగ్గజాలుగా పేరుగాంచిన సంస్థలు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఎవర్‌గ్రాండే (Evergrande) 300 బిలియన డాటర్లకు పైగా అప్పులతో కుప్పకూలి, ఆగస్టు 2025లో స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి వైదొలిగింది. అత్యంత స్థిరమైన సంస్థగా పేరున్న వాంకే (Vanke), 2024లో రికార్డు స్థాయిలో 6.8 బిలియన్ డాలర్ల నష్టాన్ని ప్రకటించి షాక్ ఇచ్చింది. కంట్రీ గార్డెన్ సంస్థ కూడా తన బకాయిలను చెల్లించలేక డిఫాల్టర్‌గా నిలిచింది.

భారత్‌లో ఆందోళన అవసరమా?
చైనా మార్కెట్ పతనాన్ని చూసి భారతీయ కొనుగోలుదారులు కూడా అయోమయానికి గురవుతున్నారు. రూపాయి విలువ పతనం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, AI కారణంగా ఉద్యోగ అనిశ్చితి వంటి కారణాలతో భారత్‌లోనూ ధరలు తగ్గుతాయేమోనని కొందరు భావిస్తున్నారు. అయితే, ఆర్థిక విశ్లేషకులు మాత్రం చైనాకు, భారత్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఉందని చెబుతున్నారు.

భారత మార్కెట్ బలంగా ఉండటానికి కారణాలు

  • చైనాలో ఇళ్లు మిగిలిపోతుంటే (Over supply), భారత్‌లో ఇంకా గృహాల కొరత ఉంది. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల డిమాండ్ నిలకడగా ఉంది.

  • భారత్‌లో పెట్టుబడిదారుల కంటే, సొంత ఇల్లు కొనుక్కునే వారి సంఖ్య (End users) ఎక్కువ. ఇది మార్కెట్‌కు స్థిరత్వాన్ని ఇస్తుంది.

  • చైనాలోలాగా కేవలం ఊహాజనిత పెట్టుబడులతో కాకుండా, భారత్‌లో జనాభా అవసరాలకు అనుగుణంగా మార్కెట్ విస్తరిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement