బెంగళూరులో జరిగిన ఒక సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వ్యాపారవేత్త అఖిల్ హేమాద్రి రోడ్డుపై గుంతను పూడ్చడానికి చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.
వీడియోలో గమనించినట్లయితే.. కోట్ల రూపాయల విలువైన పోర్స్చే కారులో అఖిల్ హేమాద్రి అక్కడికు వచ్చి, రోడ్డుపై ఉన్న గుంతను పూడ్చడానికి సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రిని తీసుకుంటారు. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించిన విషయం ఏమిటంటే.. సిమెంట్ మిశ్రమాన్ని కారు బానెట్ మీద కలిపాడు. ఖరీదైన కారుపై ఇలా చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ ఆయన తన కారుపై రక్షణ పొర (PPF) ఉండటం వల్ల ఎలాంటి నష్టం జరగదని చూపించడానికి ఈ విధానం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
సిమెంట్ మిశ్రమం కలిపిన తరువాత గుంతను పూడ్చేస్తాడు. చివరగా బానెట్‌పై ఉన్న షీట్‌ను తొలగిస్తారు. దీంతో కారుకు ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా కార్ల రక్షణ కోసం ఉపయోగించే పీపీఎఫ్ బలాన్ని చూపించడమే ఈ వీడియో ఉద్దేశ్యం అయినప్పటికీ.. ఈ చర్య ద్వారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించారని పేర్కొన్నారు.
వీడియో షేర్ చేసిన హెచ్1 కార్ డీటైలింగ్.. ''మన పరిసరాలను పరిశుభ్రంగా, చక్కగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. మనం ప్రతిదానికీ ఎల్లప్పుడూ ప్రభుత్వంపై ఆధారపడకూడదు. మన దేశంలో జనాభా చాలా ఎక్కువ, కేవలం ప్రభుత్వ ప్రయత్నాలతో మాత్రమే మార్పు రాదు. మనలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించినప్పుడే నిజమైన మార్పు మొదలవుతుంది'' అని వెల్లడించింది.


