యాపిల్ సీఈఓగా జాన్ టెర్నస్
హార్డ్‌వేర్ బాస్‌గా జానీ స్రూజీ
ప్రపంచంలోనే నం 1 టెక్ కంపెనీ యాపిల్ తన నాయకత్వంలో మార్పులు ప్రకటించింది. దశాబ్ద కాలానికిపైగా సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్ ఈ ఏడాది చివర్లో సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన వారసుడిగా ప్రస్తుతం హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం బాధ్యతలు చూస్తున్న జాన్ టెర్నస్ సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు. అదే సమయంలో యాపిల్ చిప్ డిజైన్లలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జానీ స్రూజీకి సంస్థ అత్యంత కీలకమైన చీఫ్ హార్డ్‌వేర్ ఆఫీసర్ బాధ్యతలను అప్పగించింది. ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా టిమ్ కుక్
సుమారు రెండు దశాబ్దాలుగా యాపిల్‌లో అంతర్భాగంగా ఉన్న జాన్ టెర్నస్ ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. టిమ్ కుక్ వారసుడిగా ఆయన ఎంపిక సంస్థ అంతర్గత వారసత్వ ప్రణాళికలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో టెర్నస్ సీఈఓగా బాధ్యతలు చేపడతారు. పదవీ విరమణ తర్వాత కుక్ పూర్తిగా తప్పుకోకుండా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉంటూ దిశానిర్దేశం చేయనున్నారు.
హార్డ్‌వేర్ చీఫ్‌గా జానీ స్రూజీ
యాపిల్ చిప్‌ల సృష్టికర్తగా పేరొందిన జానీ స్రూజీ పాత్ర ఇప్పుడు మరింత విస్తృతమైంది. ఇప్పటివరకు హార్డ్‌వేర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన ఇకపై చీఫ్ హార్డ్‌వేర్ ఆఫీసర్ హోదాలో పూర్తిస్థాయి హార్డ్‌వేర్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. ఈ హోదాలో ఆయన బాధ్యతలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
స్రూజీ పర్యవేక్షణలో ఉండే విభాగాలు
సిలికాన్, ప్రాసెసర్లు: ఏ-సిరీస్ (iPhone), ఎం-సిరీస్ (Mac) చిప్‌ల అభివృద్ధి.
డిస్‌ప్లేలు, కెమెరా సెన్సార్లు, బ్యాటరీ టెక్నాలజీ, స్టోరేజ్ కంట్రోలర్లు.
సెల్యులార్ మోడెమ్‌ల తయారీ, ఇంటిగ్రేషన్.


