ఎయిరిండియా ఉద్యోగులకు ఛైర్మన్ హెచ్చరిక | Air India Chairman Warns Employees Amid Record Losses Operational Challenges | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా ఉద్యోగులకు ఛైర్మన్ హెచ్చరిక

Apr 11 2026 11:45 AM | Updated on Apr 11 2026 12:51 PM

Air India Chairman Warns Employees Amid Record Losses Operational Challenges

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా  ప్రస్తుతం ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని, రాబోయే కాలం మరింత సవాలుతో కూడుకున్నదని టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. రికార్డు స్థాయి నష్టాలు, నిరంతర కార్యాచరణ వైఫల్యాల నేపథ్యంలో సంస్థను గాడిలో పెట్టేందుకు ఉద్యోగులందరూ అంకితభావంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల గురుగ్రామ్‌లోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్గత సమావేశంలో ఆయన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. సంస్థ భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేస్తూనే ప్రస్తుత ఇబ్బందులను చంద్రశేఖరన్ హైలైట్‌ చేశారు.

ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

‘గతంలో ఎయిరిండియా సిబ్బంది కంపెనీ క్లిష్ట సమయాల్లో ఎంతో పట్టుదల చూపారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. సంస్థ ఆశయాలకు అనుగుణంగా బలమైన పునాది వేసినప్పటికీ, విమానయాన రంగంలో వస్తున్న మార్పులు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రస్తుతం మన నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెట్టాలి. పనితీరు అమలు, ఖర్చుల నియంత్రణలో రాజీ పడకూడదు’ అని సూచించారు.

ఎయిరిండియాకు సవాళ్లు..

టాటా గ్రూప్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎయిరిండియాను పునరుద్ధరించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ పలు అంశాలు సంస్థను వేధిస్తున్నాయి. ఈ ఏడాది కంపెనీ తన అతిపెద్ద వార్షిక నష్టాన్ని నివేదించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) క్యాంప్‌బెల్ విల్సన్ కంపెనీ నుంచి నిష్క్రమిస్తుండడం మరో ఎదురుదెబ్బ. విస్తారాతో విలీనం తర్వాత ఏకీకరణ ప్రక్రియకు అవుతున్న భారీ ఖర్చులు, కొత్త విమానాల కొనుగోలు వ్యయం సంస్థపై భారాన్ని పెంచాయి.

బాహ్య కారణాల ప్రభావం

అంతర్జాతీయ పరిణామాలు కూడా ఎయిరిండియా లాభదాయకతను దెబ్బతీస్తున్నాయి. పెరుగుతున్న విమాన ఇంధన ధరలు నిర్వహణ వ్యయాన్ని పెంచాయి. పాకిస్థాన్‌ గగనతలంపై ఆంక్షలు, మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా విమానాలను ఇతర మార్గాల్లో మళ్లించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా కీలకమైన అమెరికా, యూరప్‌ మార్గాల్లో కంపెనీ తన ఆధిక్యతను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

టాటా గ్రూప్ పూర్తి మద్దతు

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంస్థ పునరుద్ధరణకు టాటా గ్రూప్ కట్టుబడి ఉందని చంద్రశేఖరన్ భరోసా ఇచ్చారు. ‘టాటా గ్రూప్ బోర్డు సంస్థకు పూర్తి మద్దతు ఇస్తుంది. మేనేజ్‌మెంట్ టీమ్‌తో కలిసి నిరంతరం పనిచేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్‌ గిఫ్ట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement