నేడు పోలీస్ గ్రీవెన్స్ రద్దు
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని, పోలీస్ బందోబస్త్ ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో తాత్కలికంగా రద్దు చేశామని, అర్జీదారులు గమనించాలని అన్నారు.
తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కొలనుకొండ వద్ద ఒక లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలో లారీ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. సేకరించిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో ఓవర్‌లోడ్‌తో వెళుతున్న ఇసుక లారీ కొలనుకొండ ప్రాంతానికి వచ్చే సరికి లారీ క్యాబిన్‌లో నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ లారీ దిగి ప్రాణాలతో బయట పడ్డారు. వారి కళ్లముందే నిమిషాల వ్యవధిలో లారీ దగ్ధమైంది. సమాచారం అందుకున్న మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. సాంకేతిక లోపం, ఓవర్ లోడ్ వల్ల లారీ ఇంజిన్ వేడి ఎక్కి ఈ మంటలు వ్యాపించి ఉంటాయని లారీ డ్రైవర్లు చెబుతున్నారు.


