లైంగిక వేధింపులు భరించలేక.. బంధువునే చంపేశారు..! | wife and husband incident in karnataka | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులు భరించలేక.. బంధువునే చంపేశారు..!

Jun 15 2026 11:33 AM | Updated on Jun 15 2026 12:20 PM

 wife and husband incident in karnataka

అనంతపురం జిల్లా: బళ్లారి తాలూకా మోకా సమీపంలో ఎల్‌ఎల్‌సీ కాలువ వద్ద అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం బొల్లనగుడ్డ గ్రామానికి చెందిన బసవన గౌడ ఈనెల 7వ తేదీన హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు వారంలోనే ఛేదించారు. ఆదివారం జిల్లా ఎస్పీ సుమన్‌ పన్నేకర్‌ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్‌ మండలం బొల్లనగుడ్డ గ్రామానికి చెందిన బసవన గౌడ బళ్లారిలోని ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌లో పని చేస్తున్నాడు. మోకా గ్రామానికి చెందిన సమీప బంధువు అయిన శ్వేతతో పరిచయం ఏర్పడింది. 

అప్పటి నుంచే ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకుని అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టేవాడు. ఏడాది పాటు లైంగికంగా కూడా వేధించినట్లు సమాచారం. బసవన గౌడ చేష్టలతో విసిగిపోయిన శ్వేత.. ఈ విషయాన్ని తన భర్త అయిన దొడ్డ బసవన గౌడ దృష్టికి తీసుకెళ్లింది. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవనగౌడ, సోదరుడు విజయ్‌ కలసి బసవన గౌడను చంపేయాలని ప్లాన్‌ వేశారు. అందులో భాగంగానే ఈనెల 7వ తేదీన రాత్రి మోకా సమీపంలోని ఎల్‌ఎల్‌సీ కాలువ వద్దకు బసవన గౌడ (27)ను పిలిపించారు. అక్కడికి రాగానే తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం ఎటువంటి ఆధారాలు లభించకుండా మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పటించి కాల్చి వేశారు. 

ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు ముగ్గురూ బెంగళూరుకు పారిపోయారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపడంతో ఈనెల 8వ తేదీన మోకా పోలీసు స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన యువకుడుని ఎవరు చంపారన్న దానిపై తీవ్రంగా చర్చానీయాంశమైంది. జిల్లా ఎస్పీ సుమన్‌ పన్నేకర్‌ దిశానిర్దేశంతో స్థానిక డీవైఎస్‌పీ, సీఐలు, ఎస్‌ఐలు రంగంలోకి దిగి హత్య కేసు మిస్టరీని ఛేదించారు. కాల్‌ డేటా ఆధారంగా విచారణ చేపట్టడంతో బసవన గౌడ హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవన గౌడ, సోదరుడు విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. లైంగికంగా వేధించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ముగ్గురినీ అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement