ఎనిమిది మంది దుర్మరణం
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత.. 13 మందికి తీవ్ర గాయాలు
రాఘవేంద్రస్వామి దర్శనానికి వస్తుండగా కర్నూలు జిల్లాలో దుర్ఘటన
మంత్రాలయం/ మంత్రాలయం రూరల్: రెప్పపాటులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎనిమిది మందిని బలితీసుకుంది. 13 మందిని క్షతగాత్రులను చేసింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున గూడ్స్ వాహనం, ఫ్లైయాష్ మిల్లర్ వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. వ్యవసాయ పనులు ముగియడంతో కర్ణాటకలోని హాసన్, చిక్‌మంగళూరు జిల్లాలకు చెందిన రైతు, సాగు కూలీలు తమ ఇష్టదైవం రాఘవేంద్రస్వామిని దర్శించుకోవాలనుకున్నారు.
దీంతో చిక్‌మంగళూరు జిల్లా తారికెర తాలూకా ఉదేవ గ్రామం, చిక్‌మంగళూరు, కన్నైనతళ్లి హళ్లి, అన్నేరడు గ్రామం, బూతుపల్లి, హాసన్ జిల్లా బెన్నూరు తాలూకా శెట్టిగెర, దావణగేరి గ్రామాలకు చెందిన 22 మంది రాఘవేంద్రస్వామి దర్శనానికి గూడ్స్ వాహనంలో ఉదేవా గ్రామం నుంచి బుధవారం సాయంత్రం పయనమయ్యారు. మంత్రాలయం వైపు వస్తుండగా.. గమ్యస్థానానికి 9 కిలోమీటర్ల దూరంలో చిలకలడోణ దాటగానే రాయచూరు నుంచి ఎదురుగా వస్తున్న ప్లైయాష్ కాంక్రీటు మిల్లర్ వాహనాన్ని యాత్రికుల వాహనం ఢీకొట్టింది.
ఫ్లైయాష్ మిల్లర్ రోడ్డు పక్క పొలంలోకి బోల్తా పడింది. యాత్రికుల వాహనం రోడ్డుపైనే బోల్తా పడి నుజ్జునుజ్జయింది. ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన 16 మందిని పోలీసులు అంబులెన్స్‌లలో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు, ఆస్పత్రిలో మరొకరు మరణించారు. 13 మంది క్షతగాత్రులను కర్నూలు పెద్దాస్పత్రికి తరలించారు.
మృతులు వీళ్లే..
ప్రమాదంలో సునీల్ (29), మీనాక్షమ్మ (52), పుట్టమ్మ (60), లోలాక్షమ్మ (38), ఎస్.కె.వీణ (25), ఆమె కూతురు చిన్నారి నిషిత (3), సుశీల్ కుమార్ (45), జయమ్మ (60) చనిపోయారు. ఇందులో డ్రైవర్ సునీల్, అతని తండ్రి, చెల్లెలు, సుశీల్‌కుమార్, ఎస్.కె. వీణ, ఆమె కూతురు చిన్నారి నిషితతోపాటు సునీల్ అత్త జయమ్మ, అవ్వ లోలాక్షమ్మ ఒకే కుటుంబానికి చెందిన వారు. ఘోర ప్రమాదానికి డ్రైవర్ సునీల్ నిద్రమత్తే కారణమని పోలీసులు చెబుతున్నారు.
ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున సాయం చేయనున్నట్టు ప్రధాని కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది.
వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవదర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 13 మంది గాయపడటం, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


