బడుగులకు బలిమి

3 Years of YS Jagan Government MBC Corporation Andhra Pradesh - Sakshi

కొత్త చరిత్రకు నాంది పలికిన సీఎం వైఎస్‌ జగన్‌ 

139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటు గొప్ప రికార్డు

56 చైర్మన్లు, 672 డైరెక్టర్లలో 50% మహిళలకే పదవులు

అత్యంత వెనుకబడిన కులాలకు గుర్తింపునిచ్చిన ప్రభుత్వం  

సాక్షి, అమరావతి: సంచార జాతికి చెందిన ఈయన పేరు పెండ్ర వీరన్న. ఉండేది పూరి గుడిసెలో. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురం సౌత్‌ గ్రామానికి చెందిన వీరన్న సంచార జాతుల అభ్యున్నతి కోసం అహరహం శ్రమించేవారు. వీరన్న కృషిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనను అత్యంత వెనుకబడిన సంచార జాతుల (ఎంబీసీ) కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు.

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఈమె పేరు జింకా విజయలక్ష్మి. న్యాయవాద వృత్తి చేపట్టి సివిల్, క్రిమినల్‌ కేసుల వాదనలో పట్టు సాధించారు. సామాజిక, రాజకీయ రంగాల్లో చైతన్యవంతమైన పాత్ర పోషిస్తున్నారు. ఆమెకు ఏపీ పద్మశాలీ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు సీఎం వైఎస్‌ జగన్‌. 

వీరిద్దరే కాదు.. వెనుకబడిన తరగతులకు చెంది.. నాయకత్వ లక్షణాలు కలిగి.. తమ జాతి అభివృద్ధిని కాంక్షించే వారిని, రాజకీయ రంగం ద్వారా సమాజానికి మేలు చేయాలనే తపన గల వారిని ఏరికోరి వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్రంలో 139 బీసీ కులాలకు 56 వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లను 2020 అక్టోబర్‌లో ఏర్పాటు చేశారు.

ఆయా సామాజిక వర్గాల్లోని పేదలకు అండగా నిలిచి ఇబ్బందులను దూరం చేసేలా.. వారందరికీ ఆర్థిక, సామాజిక బలిమి చేకూరేలా సంబంధిత కార్పొరేషన్లను తీర్చిదిద్దారు. కార్పొరేషన్లను సామాజిక చైతన్య వేదికలుగా మలిచి రాష్ట్రంలో కొత్త చరిత్రకు సీఎం జగన్‌ నాంది పలికారు. వాస్తవానికి వెనుకబడిన తరగతుల్లో బయట ప్రపంచానికి పేర్లు సైతం తెలియని కులాలను కూడా గుర్తించారు.

అత్యంత వెనుకబడిన, నిర్లక్ష్యానికి గురైన అనేక కులాలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కార్పొరేషన్‌కు ఒక చైర్మన్, 12 డైరెక్టర్లను నియమించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక రికార్డు. రాష్ట్రంలో 56 కార్పొరేషన్ల చైర్మన్లు, 672 డైరెక్టర్ల పదవుల్లో 50 శాతం పదవులను మహిళలకే కట్టబెట్టి మరో రికార్డును నెలకొల్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top