మహారాణిపేట(విశాఖ): నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం)లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఎన్‌టీఏను రద్దు చేయాలని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ‘విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దు’ నినాదంతో శనివారం విశాఖలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నీట్ పరీక్షను రాష్ట్రాలే నిర్వహించాలని, పేపర్ లీక్‌కు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని తీర్మానించారు. అలాగే సీబీఎస్‌ఈ ఆన్‌స్క్రీన్ మార్కింగ్‌లో పారదర్శకత పెంచాలని, బాధిత విద్యార్థులకు ఉచిత పునర్మూల్యాంకనం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జేవీవీ రాష్ట్ర కార్యదర్శులు జి.గిరిధర్, వై.ఎ.ఆర్.కె.ప్రసాద్, సీనియర్ రాష్ట్ర నాయకులు కె.త్రిమూర్తులురెడ్డి, సమతా రాష్ట్ర కన్వీనర్ జి.నిర్మల, ప్రజారోగ్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు, పాల్గొన్నారు.


