లాభాల వేటలో పది ‘ఉక్కు’ కుటుంబాల్లో నిండిన చీకట్లు! నాసిరకం ముడిపదార్థాలు, సిబ్బంది కొరత,పనిఒత్తిడి కలిసి సృష్టించిన విషాదం అధికారుల కమిటీ విచారణలో వెలుగుచూస్తున్న దిగ్భ్రాంతికర వాస్తవాలు | - | Sakshi
Sakshi News home page

లాభాల వేటలో పది ‘ఉక్కు’ కుటుంబాల్లో నిండిన చీకట్లు! నాసిరకం ముడిపదార్థాలు, సిబ్బంది కొరత,పనిఒత్తిడి కలిసి సృష్టించిన విషాదం అధికారుల కమిటీ విచారణలో వెలుగుచూస్తున్న దిగ్భ్రాంతికర వాస్తవాలు

Jun 14 2026 7:28 AM | Updated on Jun 14 2026 7:28 AM

ఉత్పత్తి కోసం భద్రతకు తిలోదకాలు

ప్రమాదానికి ముందు నుంచే ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలన్న ఒత్తిడి తీవ్రంగా పెరిగిందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. లాడిల్‌ పూర్తి సామర్థ్యం 150 టన్నులు కాగా, ప్రమాదం జరిగిన రోజు దాదాపు 140 టన్నుల ద్రవపు ఉక్కుతో ప్రక్రియ నిర్వహించినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, సమయాన్ని ఆదా చేయడంపైనే దృష్టి పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఉత్పత్తి వ్యయం తగ్గింపు పేరుతో కొన్ని కీలక భద్రతా ప్రక్రియలను కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని కార్మికులు చెబుతున్నారు. అలాగే కొన్ని విభాగాల్లో 12 గంటల పని విధానాన్ని అమలు చేస్తుండగా, ఉత్పత్తిని వేతనాలతో అనుసంధానించడం ద్వారా ఉద్యోగులపై మరింత ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపిస్తున్నారు. ఫలితంగా భద్రతా ప్రమాణాల కంటే ఉత్పత్తి లక్ష్యాలకే ప్రాధాన్యం దక్కుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కుదిపేసిన ఘోర ప్రమాదం వెనుక ఉత్పత్తి లక్ష్యాల కోసం జరిగిన హడావుడి, భద్రతా నిబంధనల పట్ల నిర్లక్ష్యం, నాసిరకం ముడిపదార్థాల వినియోగం ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లాడిల్‌లో ద్రవపు ఉక్కు పేలి 10 మంది కార్మికుల ప్రాణాలు బలిగొన్న ఈ ఘటనపై సాగుతున్న దర్యాప్తులో ఒక్కో వాస్తవం వెలుగులోకి వస్తోంది. సాధారణంగా లాడిల్‌లోని ద్రవ ఉక్కును శుద్ధి చేసి ఆక్సీకరణ ప్రక్రియ పూర్తిచేసిన తర్వాతే కంటిన్యూయస్‌ కాస్టింగ్‌ యంత్రానికి తరలిస్తారు. ఇందుకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసిజర్‌ (ఎస్‌వోపీ) ప్రకారం కనీసం 18 నిమిషాల సమయం అవసరం. అయితే ఉత్పత్తి వేగం పెంచాలన్న ఒత్తిడితో ఈ ప్రక్రియను కేవలం 10 నిమిషాల్లో ముగించినట్లు విచారణలో తేలినట్టు సమాచారం. ఈ తొందరపాటే చివరకు ఘోర విషాదానికి దారితీసిందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నాసిరకం ముడిపదార్థాల వినియోగం కారణంగా ప్లాంట్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికితోడు ఆక్సీకరణ ప్రక్రియను పూర్తిస్థాయిలో నిర్వహించకపోవడం వల్ల లాడిల్‌లో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడి పేలుడు సంభవించినట్లు ప్రాథమిక నిర్ధారణలు సూచిస్తున్నాయి.

ఆక్సీకరణలో ఏం తప్పు జరిగింది?

పిగ్‌ ఐరన్‌ను కరిగించిన అనంతరం బ్లాస్ట్‌ ఫర్నేస్‌ నుంచి వచ్చే ద్రవ లోహంలో అవసరాన్ని బట్టి ఫెర్రోమాంగనీస్‌, ఫెర్రోసిలికాన్‌ వంటి పదార్థాలను కలుపుతారు. ఆ తర్వాత ఆక్సీకరణ ప్రక్రియ చేపడతారు. ఈ సమయంలో ఆక్సిజన్‌ను ప్రవేశపెట్టడంతో కార్బన్‌ మోనాకై ్సడ్‌, కార్బన్‌ డయాకై ్సడ్‌ వంటి వాయువులు ఉత్పత్తి అవుతాయి. కొన్నిసార్లు ఈ వాయువులు ద్రవపు ఉక్కులోనే చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆర్గాన్‌ గ్యాస్‌ను ఉపయోగించి బాటమ్‌ పర్జింగ్‌ నిర్వహిస్తారు. దీంతో ద్రవ ఉక్కులో చిక్కుకుపోయిన వాయువులు, మలినాలు బయటకు వస్తాయి. అలాగే ద్రవపు ఉక్కు నాణ్యతను నిర్ధారించేందుకు నమూనా పరీక్షలు కూడా నిర్వహించాలి. అయితే ఈ కీలక దశలను పూర్తిస్థాయిలో పాటించకపోవడం, శుద్ధి ప్రక్రియను తొందరపాటుతో ముగించడం వల్లే ప్రమాదం సంభవించినట్లు విచారణలో తేలినట్టు సమాచారం. దీంతో లాడిల్‌లో ఒక్కసారిగా తీవ్ర ప్రతిచర్య చోటుచేసుకుని, సుమారు 1,600 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ద్రవ ఉక్కు భారీగా ఎగసిపడింది. భవనం పైకప్పును తాకిన ద్రవపు ఉక్కు తిరిగి వర్షంలా కురిసి అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడింది. ఘటనాస్థలంలోనే ఎనిమిది మంది మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ప్రమాదంపై విచారణ జరుపుతున్న ముగ్గురు సభ్యుల కమిటీతో పాటు ఫైర్‌, ఫ్యాక్టరీస్‌ శాఖల అధికారులు నిర్వహించిన తనిఖీల్లోనూ ఇదే అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.

లోకేష్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం

ప్రమాదం అనంతరం సిబ్బంది కొరత అంశంపై మంత్రి నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు కార్మిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల ప్రమాదం జరగలేదని, అదే కారణంగా బాధితుల సంఖ్య తగ్గిందని ఆయన వ్యాఖ్యానించినట్లు ప్రచారం కావడంతో కార్మికులు మండిపడుతున్నారు. వాస్తవానికి తగిన సిబ్బంది, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉండి ఉంటే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి నివారించే అవకాశం ఉండేదని వారు వాదిస్తున్నారు. సిబ్బంది కొరత, పెరిగిన పనిభారం, ఉత్పత్తి ఒత్తిడి, భద్రతా నిబంధనల ఉల్లంఘనలు కలిసి ఈ ఘోర ప్రమాదానికి కారణమయ్యాయని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

21 మంది పని 11 మందితోనే..

సీ్టల్‌ ప్లాంట్‌లో ప్రైవేటీకరణ చర్యలు వేగం పుంజుకున్న తర్వాత సిబ్బంది సంఖ్య భారీగా తగ్గిందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. గత కొన్నేళ్లలో దాదాపు 10 వేల మంది ఉద్యోగులు తగ్గిపోవడంతో మిగిలిన వారిపై పనిభారం విపరీతంగా పెరిగిందని చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన విభాగంలో సాధారణంగా 21 మంది పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 11 మంది మాత్రమే విధుల్లో ఉన్నారని సమాచారం. అనుభవజ్ఞులైన ఉద్యోగులు, సాంకేతిక నిపుణుల సంఖ్య తగ్గిపోవడంతో పర్యవేక్షణ వ్యవస్థ బలహీనపడిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement