రక్తం పంచే ‘దేవుళ్లు’.. ప్రాణం నిలిపే బంధువులు | - | Sakshi
Sakshi News home page

రక్తం పంచే ‘దేవుళ్లు’.. ప్రాణం నిలిపే బంధువులు

Jun 14 2026 7:28 AM | Updated on Jun 14 2026 7:28 AM

● మానవత్వానికి మచ్చుతునకై న రక్తదాతలు ● చుక్క రక్తంతో ప్రాణాలు నిలబెడుతున్న మహాదాతలు ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

స్వచ్ఛంద రక్తదానం.. మానవత్వానికి స్వచ్ఛమైన నిదర్శనం. ఒకరి శరీరంలో ప్రవహించే రక్తం.. మరొకరి జీవితంలో సంతోషాల వెల్లువను పూయిస్తుంది. అత్యవసర సమయాల్లో చుక్క రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న వేళ.. ఎలాంటి పరిచయం లేని అపరిచిత వ్యక్తికి రక్తాన్ని అందించి మృత్యువుతో పోరాడుతున్న వారిని బతికించడమే నిజమైన ప్రాణదానం. ‘దేశం నీకేమిచ్చిందనేది కాదు.. దేశానికి నీవేమిచ్చావనేదే ముఖ్యం’ అనే నినాదంతో సాగుతున్న రక్తదాతల కథనం ఇది.

మునగపాక మండలం టి.సిరసపల్లికి చెందిన కొమ్మోజు గణేష్‌ 24 సార్లు రక్తదానం చేసి ఎంతోమంది యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.నిరంతర సేవా ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి అవసరమైన వారికి రక్తం అందేలా కృషి చేస్తున్నాడు. తన ఫౌండేషన్‌ ద్వారా చేపట్టిన రక్తదాన ఉద్యమంలో వేలాది మందిని భాగస్వామ్యులను చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు. బీటెక్‌ పూర్తి చేసిన గణేష్‌ కోవిడ్‌ సమయంలో రోగుల అవసరాన్ని గుర్తించి స్నేహితుల సహకారంతో రక్తం, ప్లాస్మా దానం చేపట్టాడు.ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏడు వేలకు పైబడి వలంటీర్ల సహకారంతో 42 రక్తదాన శిబిరాలు నిర్వహించాడు. రక్తదానంతో పాటు పేదలకోసం ఉచిత వైద్య శిబిరాలు, క్యాన్సర్‌ పరీక్ష శిబిరాలు సొంతంగా నిర్వహిస్తున్నాడు. గణేష్‌ సేవలను గుర్తించి ప్రాణదాత సేవా పురస్కారాలను అందజేశారు.

రక్తదానికి అందరూ ముందుకు రావాలి

ప్రతీ ఇంటి నుంచి రక్తదాతలను తయారు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నా.యువత ముందుకొచ్చి ఆపదలో ఉన్న వారికి రక్తం అందించి ప్రాణాలను కాపాడాలి. రక్తం అందక ఎవరూ చనిపోకూడదన్న ఆశయంతో నిరంతర సేవా ఫౌండేషన్‌ స్థాపించాం.ప్రతీ ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి.

– కొమ్మోజు,గణేష్‌,

నిరంతర సేవా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు

డాబాగార్డెన్స్‌/విశాఖ విద్య/మునగపాక: ఒకరికి మరొకరితో పరిచయం ఉండదు. బంధుత్వం ఉండదు. కులం, మతం, ప్రాంతం అనే భేదాలూ ఉండవు. అయినా ఒకరు ఇచ్చే చుక్క రక్తం మరొకరి ప్రాణాన్ని కాపాడుతుంది. ఓ కుటుంబంలో ఆరిపోతున్న ఆశాదీపాన్ని మళ్లీ వెలిగిస్తుంది. అందుకే స్వచ్ఛంద రక్తదానాన్ని అన్ని దానాలకన్నా గొప్పదానంగా భావిస్తారు. ప్రాణం విలువ తెలిసినవారే రక్తదానం చేస్తారు. అందుకే రక్తదాతలను మానవత్వానికి ప్రతిరూపాలుగా చూస్తారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూన్‌ 14న నిర్వహించడం వెనుక ఉద్దేశం కూడా ఇదే. ప్రాణదానంగా నిలిచే రక్తదానంపై అవగాహన పెంచడం, కొత్త రక్తదాతలను తయారుచేయడం, ఇప్పటికే సేవలందిస్తున్న వారిని గౌరవించడం.

ప్రాణం పోసే మానవత్వం

రోడ్డు ప్రమాదాలు, ప్రసవాలు, శస్త్రచికిత్సలు, క్యాన్సర్‌ చికిత్సలు, తలసేమియా వంటి వ్యాధుల చికిత్సలో రక్తం అత్యవసరం. సమయానికి రక్తం అందకపోతే ప్రాణాలు కోల్పోయే ఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఆస్పత్రికి తీసుకొచ్చినా రక్తదాతలు దొరక్క విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి సమయంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చే రక్తదాతలు నిజమైన ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. వారు ఇచ్చే ఒక్క యూనిట్‌ రక్తాన్ని మూడు భాగాలుగా విభజించి ముగ్గురికి ఉపయోగించవచ్చు. అంటే ఒక రక్తదాత ముగ్గురి జీవితాల్లో వెలుగు నింపగలడు.

రక్తదానం చేయాలంటే..

18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఆరోగ్యవంతులైన వ్యక్తులు రక్తదానం చేయవచ్చు. రక్తపోటు, హిమోగ్లోబిన్‌, శరీర ఉష్ణోగ్రత తదితర పరీక్షల అనంతరం మాత్రమే రక్త సేకరణ చేస్తారు. రక్తదానం వల్ల ఎలాంటి వ్యాధులు సంక్రమించవు. రక్తదానం చేసిన తర్వాత 10 నిమిషాల విశ్రాంతి తీసుకుని అల్పాహారం తీసుకుంటే తిరిగి సాధారణ పనులు చేసుకోవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement