యూరియా కొరత.. అన్నదాత కలత! | - | Sakshi
Sakshi News home page

యూరియా కొరత.. అన్నదాత కలత!

Jun 14 2026 7:28 AM | Updated on Jun 14 2026 7:28 AM

సాక్షి, అనకాపల్లి: జిల్లాలో రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో ప్రారంభంలోనే ఎరువుల కొరత అన్నదాతలను కలవరపెడుతోంది. గత రెండేళ్లుగా ప్రభుత్వ పెట్టుబడి సాయం అందక, వాతావరణ మార్పు వల్ల నష్టాలతో రైతులు కుదేలయ్యారు. ఈ ఏడాది కోటి ఆశలతో సాగుకు సమాయత్తమవుతున్న సమయంలో ఎరువులకొరత నిరాశనిస్పృహలకు గురిచేస్తోంది.జిల్లాలోని 24 మండలాల్లో 2,50,888 మంది రైతులు 1.8 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 1.2 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. ఏటా 51,277 మెట్రిక్‌ టన్నుల ఎరువుల అవసరం ఉండగా, రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌ల ద్వారా పంపిణీ సక్రమంగా జరగకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. ఒకవైపు పంట బీమా లేకపోవడం, మరోవైపు ఆర్బీకేలను కుదించి సబ్సిడీ విత్తనాలు, ఎరువుల పంపిణీని నిలిపివేయడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. గత ఏడాదిలో తుఫాన్‌ నష్టపరిహారం అందకపోవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగం.. ఇప్పుడు బ్లాక్‌ మార్కెట్‌లో యూరియా, డీఏపీలను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.

సీజన్‌ ప్రారంభంలోనే..

ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలోనే యూరియా కొరతతో అన్నదాతలు రోడ్డెక్కవలసి వస్తోంది. ముందస్తుగా అవసరమైనంత మేర ఎరువులను సిద్ధం చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా సక్రమంగా చర్యలు చేపట్టకపోవడంతో యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇటీవల మునగపాక పీఏసీఏస్‌ ద్వారా రైతులకు యూరియా పంపిణీ చేశారు. క్యూలో ఉన్న రైతులకు చీటీలు అందిస్తూ యూరియా పంపిణీ చేస్తూ వచ్చారు. పలువురు రైతులు యూరియా కోసం ఉదయం 7గంటలకే పీఏసీఎస్‌కు చేరుకున్నారు. సకాలంలో యూరియా అందించకపోవడంతో తీవ్ర అవస్థలకు గురైన అన్నదాతలు సంబంధిత సిబ్బందితో వాగ్వాదం చేశారు. చీటీలు రాయడంలో జాప్యాన్ని నిరసిస్తూ మెయిన్‌రోడ్డుపై రైతులు ఆందోళనకు దిగారు.

కౌలు రైతులకు ఎగవేత..

రైతును రాజు చేస్తామని ..అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు సర్కార్‌.. తొలి ఏడాదే ఎగనామం పెట్టింది. ఇక రెండో ఏడాదిలో అరకొరగా..రెండు, మూడు విడతల చొప్పున రూ.10 వేలతో సరిపెట్టేసింది. రైతులకు అన్నివిధాలా అండగా ఉన్న రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ను నిర్వీర్యం చేసింది. ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తుందని ఆశ పెట్టుకున్న కౌలు, ఈనామ్‌ రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలో మొత్తం 11,273 మంది రైతులు(కౌలు రైతులు 9,173, ఈనామ్‌ రైతులు 2,100) తీవ్రంగా నష్టపోయారు. ఉచిత పంట బీమా లేకపోవడం, గత ఏడాది వచ్చిన తుఫాన్‌ నష్టపరిహారం ఇంకా అందకపోవడంతో కౌలు, చిన్నకారు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

ఆర్‌బీకేలు నిర్వీర్యం

విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకూ సాగులో రైతుకు అన్నివిధాలా అండగా ఉండేందుకు గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసింది. చంద్రబాబు ప్రభుత్వం వాటి పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చింది. కొన్ని ఆర్బీకే భవనాలను ఇతర కార్యాలయాలకు వినియోగిస్తుండగా, మరికొన్ని తాళం వేసి కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలను కూడా తగ్గించేశారు. జిల్లాలో 40కు పైగా ఆర్‌బీకేలను కుదించేశారు.

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే

వేధిస్తున్న ఎరువుల కొరత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement