ఏయూలో ఉద్యోగాల పేరుతో దళారుల దందా | - | Sakshi
Sakshi News home page

ఏయూలో ఉద్యోగాల పేరుతో దళారుల దందా

Jun 14 2026 7:28 AM | Updated on Jun 14 2026 7:28 AM

ఎవరూ నమ్మి మోసపోవద్దన్న అధికారులు

విశాఖ విద్య: ఏయూలో ఉద్యోగాల భర్తీ పేరుతో కొందరు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఇటీవల ఏయూ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయగా, మరికొన్ని తాత్కాలిక అధ్యాపక పోస్టుల భర్తీకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలతో పరిచయాలు ఉన్నాయంటూ కొందరు దళారులు నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజులుగా యూనివర్సిటీలోని కొందరు వ్యక్తులు, బయట ఉన్న మధ్యవర్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై ఏయూ యాజమాన్యం స్పందించింది. ఉద్యోగాల భర్తీ పేరుతో ఎలాంటి అక్రమాలు జరిగినట్లు ఇప్పటివరకు తమకు ఫిర్యాదులు అందలేదని ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కె. రాంబాబు స్పష్టం చేశారు. ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయాలని, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశ్వవిద్యాలయం పేరును దుర్వినియోగం చేసినా, ఉద్యోగులు ఇటువంటి చర్యలకు పాల్పడినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఏయూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లు ప్రముఖ దినపత్రికలు, ఏయూ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారానే విడుదల చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే దళారులు, మధ్యవర్తులను నమ్మి ఎవరూ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని నిరుద్యోగులకు రిజిస్ట్రార్‌ సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement