● నలుగురి అరెస్టు
● కారు, బైక్, సెల్ ఫోన్లు సీజ్
నర్సీపట్నం:గంజాయి తరలిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నలుగురిని శనివారం అరెస్టు చేశారు. నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపిన మేరకు వివరాలు... ముందుస్తు సమాచారంతో రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, నాతవరం, నర్సీపట్నం ఎస్‌ఐలు వై.తారకేశ్వరరావు, రాజారావు, సిబ్బంది బెన్నవరం వద్ద మాటు వేసి గంజాయి తరలిస్తున్న కారును అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన రామాని రాజేష్ ఐటీఐ చదివాడు. హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విద్యార్థి దశ నుంచే రాజేష్‌కు గంజాయి సేవించే అటవాటు ఉంది. ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. స్నేహితులైన రుద్రరాజు వర్మ, షేక్ షయాంబాషా, ముంగర సురేష్‌తో ఈ నెల 9న ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా పటేల్ గ్రామానికి వెళ్లి 30 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లో కారును అద్దెకు తీసుకున్నారు. ఒక బైక్‌ను కొనుగోలు చేశారు. రాజేష్, రుద్రరాజు దినేష్ వర్మ కారులో గంజాయి తీసుకువస్తున్నారు. మిగిలిన ఇద్దరు బైక్‌పై వస్తూ నాతవరం మండలం బెన్నవరం వద్ద పోలీసులకు చిక్కారు. నలుగు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి గంజాయి, కారు, బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని హైదరాబాద్ తీసుకువెళ్లి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించి వచ్చిన డబ్బును పంచుకునేందుకు నలుగురు నిందితులు ఆలోచన చేశారని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలోచాకచక్యంగా వ్యవహరించిన సీఐ రేవతమ్మ, ఎస్‌ఐలు తారకేశ్వరరావు, రాజారావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.


