మహారాణిపేట: సముద్ర తీరంలో మద్యం విక్రయాలకు అనుమతినిచ్చే ప్రభుత్వ ‘బీచ్ షాక్’ నిర్ణయాన్ని నిరసిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో శనివారం ఆర్‌కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి.ప్రభావతి, జిల్లా నేతలు ఆర్.ఎన్. మాధవి, సత్యవతి, బి. పద్మ మాట్లాడుతూ.. గోవా కల్చర్ పేరుతో బీచ్‌లలో మద్యం అమ్మకాలు జరపడం దుర్మార్గమన్నారు. ఖజానా నింపుకోవడానికి, మద్యం సిండికేట్ల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. కుటుంబాలు, మహిళలు ప్రశాంతత కోసం వచ్చే బీచ్‌లో మద్యం అందుబాటులోకి వస్తే మహిళల రక్షణ గాల్లో కలిసిపోతుందని, పర్యావరణం ధ్వంసమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో బెల్ట్ షాపులు, గంజాయి, డ్రగ్స్ రవాణాను అణచివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు డి.కొండమ్మ, ఆర్.వరలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు బి.ఎల్. నారాయణ తదితరులు పాల్గొన్నారు.


