స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదానికి
అదే కారణమా?
మెటీరియల్ కొనుగోళ్లపై ఆరోపణలు
పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న
కార్మికసంఘాలు
లాడెల్‌కు ఆర్గాన్ బాటమ్ పర్జింగ్
చేయడం లేదని ఆరోపణ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదానికి నాసిరకం ముడిపదార్థాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్‌వోపీ) పాటించకపోవడం వంటివి కారణాలన్న అనుమా నాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. లాడెల్‌లో మలినాలను తొలగించేందుకు వీలు గా చేయా ల్సిన ఆర్గాన్ బాటమ్ పర్జింగ్ చేయకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని భావిస్తున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్‌ప్లాంట్‌ను ఆర్థిక సమస్యలు వేధిస్తున్న నేపథ్యంలో బయటి నుంచి మాంగనీస్, సిలికా మాంగనీస్, పెట్రోకోక్, అల్యూమినియం తదితర ముడిపదార్థాలను తక్కువ ధర పేరుతో నాసిరకమైనవి కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నాసిరకం ముడిపదార్థాలను హాట్ మెటల్‌లో వేసినప్పుడు మలినాల వల్ల ఇటువంటి పేలుడు సంభవించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లాడెల్‌లో ఉండే లీకుల వల్ల ద్రవపు ఉక్కు కింద పడిపోవడం జరు గుతుంటుందని.. ఇటువంటి పేలుడు మాత్రం మలినాల వల్లే జరిగే అవకాశం ఎక్కువ అనే నిపు ణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ప్రక్రియ జరుగుతోందన్న విమర్శలు బలంగా ఉన్నాయి. స్టీల్‌ప్లాంట్‌లో ఒక్కో విభాగాన్ని ప్రైవేటుకు అప్పగించడంతోపాటు వేలసంఖ్యలో కార్మికుల తొలగింపు, వీఆర్‌ఎస్ పేరుతో ఇంటికి పంపుతున్నారు. ఈ వ్యవహారాలపై కార్మికులు, కార్మికసంఘాలు మొత్తుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వంలోని నేతలు ఎవరూ మాట్లాడటం లేదు.
పేలుడుకు మలినాలే కారణమా..: లాడెల్ నుంచి 1,600 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ద్రవపు ఉక్కు లీకుల వల్ల కిందపడటం సాధారణంగా జరుగుతుంటుందని స్టీల్‌ప్లాంట్ సిబ్బంది సైతం చెబుతున్నారు. అయితే ఏకంగా పేలుడు జరగటం ఇదే మొదటిసారి అని గుర్తుచేస్తున్నారు. తాజాగా జరిగిన దుర్ఘటనలో మాత్రం ఏకంగా లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు పేలి ఎగసిపడిందని అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ప్రమాద స్థలానికి దూ రంగా ఉన్న ప్రాంతంలోని మందపు గ్లాసులు కూడా పగిలి అక్కడున్న వారిపైన కూడా లాడెల్ నుంచి ఎగసిన ద్రవపు ఉక్కు పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ స్థాయిలో పేలుడు సంభవించేందుకు ప్రధాన కారణం.. నాసిరకం ముడిసరుకులతోపాటు ఎస్‌వోపీని పాటించకపోవడమేనని చెబుతున్నారు. కవ్వంతో మజ్జిగను చిలికితే వెన్నె పైకివచ్చిన విధంగానే సాధారణంగా ఆర్గాన్ బాటమ్ పర్జింగ్ వల్ల లాడెల్‌లో మలినాలు పైకివస్తాయి. ఈ ప్రక్రియలో లాడెల్‌కు కిందినుంచి పైపు పంపించి.. ఆర్గాన్ గ్యాస్ పంపిస్తారు. తద్వారా లాడెల్‌లో ఉన్న 150 టన్నుల ద్రవపు ఉక్కులో ఉన్న మలినాలు బయటకు వస్తాయి. ఉత్పత్తి వ్యయం తగ్గింపు సాకుతో ఈ ప్రక్రియను సరిగ్గా చేయడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా స్క్రాప్ ఇనుమును ప్రాసెస్ చేసే సమయంలో తేమ ఉన్నా.. మలినాలుంటే ఇటువంటి పేలుడు సంభవిస్తుందని అధికారులు అంటున్నారు. గతంలో నూజివీడులో ఐర న్ స్క్రాప్ దుకాణంలో ఇటువంటి పేలుడు సంభవించి ఐదుగురు మరణించారని గుర్తుచేస్తున్నారు. ఇక్కడ కూడా అదే తరహాలో పేలుడు సంభవించిన నేపథ్యంలో.. నాసిరకం ముడిపదార్థాలతో పాటు ఆర్గాన్ బాట మ్ పర్జింగ్ చేయకపోవడమే కారణమని పేర్కొంటున్నారు.
తక్కువ సిబ్బంది
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ నిరంతరం ఒక యుద్ధ ప్రక్రియలాగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆరువేల మంది కాంట్రాక్టు సిబ్బందిని తొలగించారు. మూడువేల మంది రెగ్యులర్ ఉద్యోగులను కూడా వీఆర్‌ఎస్ పేరుతో ఇంటికి సాగనంపారు. దీంతో స్టీల్‌ప్లాంట్‌లో సిబ్బంది కొరత నెలకొంది. ఉదాహరణకు ప్రమాదం జరిగిన స్టీల్ మెల్టింగ్ షాప్–1 వద్ద 21 మంది సిబ్బంది ఉండాల్సి ఉంది. అయితే ఇక్కడ 11 మంది మాత్రమే ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎనిమిదిమంది మాత్రమే పనిచేస్తున్నారు. సరిపడిన సిబ్బంది లేకపోవడంతో పాటు ఉత్పత్తి పెంచాలనే ఒత్తిడితో తమకు ప్లాంట్ ఆపరేట్ చేసేందుకు ఇవ్వాల్సిన సరైన సమయం కూడా ఇవ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు. గంటలో చేయాల్సిన పనిని అరగంటలో చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారని పేర్కొంటున్నారు. దీంతో ఎస్‌వోపీని పాటించకుండా హడావుడిగా ప్లాంట్‌ను రన్ చేస్తుండటం కూడా ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేసే లక్ష్యంతో ప్లాంట్‌లో ప్రైవేటీకరణ, ఉద్యోగులను తొలగింపు సాగుతున్నాయి.


