పెన్‌గంగను తవ్వేస్తూ.. టిప్పర్లతో తరలిస్తూ యథేచ్ఛగా సహజ సంపద అక్రమ తరలింపు ‘మామూలు’గా వ్యవహరిస్తున్న అధికారులు
బేల మండలంలోని సాంగిడి వద్ద గల పెన్‌గంగ ఇది. నదిలో నీరు ఉన్నా ప్రతిరోజు ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. గతంలో ఇక్కడ వేలం నిర్వహించిన వీడీసీ సభ్యులపై కేసులు సైతం నమోదయ్యాయి. అయినప్పటికీ అక్రమ దందా మాత్రం ఆగడంలేదు.
ఆదిలాబాద్: పెన్‌గంగలో ఇసుకాసురులు మకాం వేశారు. నదిని నిత్యం జేసీబీలతో తోడేస్తున్నారు. సహజ సంపదను యథేచ్ఛగా తరలిస్తున్నారు. అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడంతో వీరి అక్రమ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే విమర్శలున్నాయి.
పరీవాహక ప్రాంతాల్లో..
జిల్లాలో పెన్‌గంగ పరీవాహక ప్రాంతాలైనా భీంపూర్ మండలంలోని వడూర్, అంతర్గాం, అర్లి టీ, గుబిడి, తాంసి కె, భోరజ్ మండలంలోని పెండల్‌వాడ, జైనథ్ మండలంలోని సాంగ్వి, ఆనందపూర్, బేల మండలంలోని కామ్‌గార్‌పూర్, సాంగిడి సమీపంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నదిలో నీరు ఉన్నప్పటికీ జేసీబీలతో తవ్వుతూ ప్రతీ పది నిమిషాలకో టిప్పర్ నింపుతుండడం గమనార్హం. వీటిని సమీప ప్రాంతాలకు తరలిస్తూ డంపింగ్ చేస్తున్నారు. తర్వాత ఇతర ప్రాంతాలకు చేరవేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్ ఇసుక ధర ప్రస్తుతం రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పలుకుతోంది. ఇలా రోజుకు లక్షల్లో ఆదాయం సమకూరుతుండడంతో అక్రమార్కులు దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
అనుమతుల పేరుతో అక్రమంగా..
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి విధానాలను తీసుకువచ్చింది. ఆన్‌లైన్‌లో చలానా చెల్లిస్తే ట్రాక్టర్‌లో ఒక ట్రిప్పు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడే తతంగమంతా మారిపోతుంది. ట్రిప్పు కోసం అనుమతి తీసుకుంటున్న కొంతమంది స్థానిక అధికారులను మచ్చిక చేసుకొని అదనంగా ట్రిప్పులు కొడుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఇసుకను చౌకగా అందిస్తుండగా, దానిని సాకుగా చూపి మరికొందరు అక్రమ దందాకు తెరలేపుతున్నారు.
మినహాయింపులతో ఇసుక తరలింపు
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెన్‌గంగ నుంచి ఇసుక తరలింపులో కొన్ని మినహాయింపులున్నాయి. ఇంద్రవెల్లి, గాదిగూడ మండలాలకు తరలింపు ఇబ్బందవుతుందని కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. టిప్పర్లలో కూడా తరలిస్తున్నారు. విషయం నా దృష్టిలో ఉంది.
– రవీందర్, మైనింగ్, ఏడీ
ఇది బేల మండలం కాంగార్‌పూర్ సమీపంలోని పెన్‌గంగ నది. ఇక్కడ నిత్యం జేసీబీలతో ఇసుకను తోడుతూ టిప్పర్లు, ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. సమీపంలోని తీర ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు.


