దరఖాస్తులు 80 వేలు.. ఇళ్లు 3,700 | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు 80 వేలు.. ఇళ్లు 3,700

Jun 15 2026 1:47 AM | Updated on Jun 15 2026 1:47 AM

‘ఇందిరమ్మ’ రెండో విడతకు తీవ్ర పోటీ లబ్ధ్దిదారుల ఎంపిక అధికారులకు సవాలే.. అర్హుల గుర్తింపునకు సాగుతున్న పరిశీలన

కై లాస్‌నగర్‌: జిల్లాలో ఇందిరమ్మ రెండోవిడత ఇళ్లకు తీవ్ర పోటీ నెలకొంది. మంజూరైన ఇళ్ల సంఖ్య గొరంత కాగా.. అర్హులైన వారి సంఖ్య కొండంతగా ఉంది. దీంతో ఇల్లు ఎవరికి దక్కుతుందనే దానిపై దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక అధికారులకు సవాలుగా మారనుంది. గుడిసెలో నివసిస్తున్న వారికి మాత్రమే మంజూరు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంతో అర్హుల గుర్తింపుపై అధికారులు ఫోకస్‌ పెంచారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొంటున్నారు.

నియోజకవర్గానికి 1500 చొప్పున..

రెండో విడతలో ఒక్కో నియోజకవర్గానికి 1500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఈ లెక్కన ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాలకు కలిపి 3వేల ఇళ్లు మంజూరయ్యాయి. పాక్షికంగా ఉన్న ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలకు మరో 786 ఇండ్లను మంజూరు చేసింది. వీటిని ఆయా మండలాల్లో అందిన ఎల్‌–1 దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా కేటాయించారు. అదే ప్రతిపాదికన గ్రామాల వారీగా కూడా కేటాయింపులు పూర్తి చేసిన హౌసింగ్‌ అధికారులు కలెక్టర్‌ రాజర్షి షా ఆమోదం కోసం పంపించారు. అయితే ఈ కేటాయింపుల్లో ఒక్కో గ్రామానికి 5నుంచి 15, జిల్లా కేంద్రంలోని ఒక్కో వార్డుకు 12 నుంచి 13 ఇళ్లు ఎల్‌1 దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా వచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

లబ్ధిదారుల ఎంపిక సవాలే..

తొలి విడతలో జిల్లావ్యాప్తంగా 16వేల ఇళ్లు మంజూరయ్యాయి. ప్రజల నుంచి అంతగా పోటీ లేకపోవడంతో ఈ విడతలో అర్హులైనవారితో పాటు రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి ఇళ్లు మంజూరయాయి. వాటి నిర్మాణాలు ముమ్మరంగా సాగుతుండటం, బిల్లులు సైతం వెంటవెంటనే వస్తుండటంతో ఈ విడతలో డిమాండ్‌ ఏర్పడింది. అలాగే ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌లోనూ వందలాది మంది దరఖాస్తులు అందజేయడం తీవ్రతకు అద్దం పడుతుంది. రెండో విడతలో కేవలం 3,786 ఇళ్లు మాత్రమే జిల్లాకు మంజూరయ్యాయి. అయితే జిల్లా వ్యాప్తంగా ఇంటి స్థలం కలిగి ఉండి ఇళ్లు లేనటువంటి వారి సంఖ్య (ఎల్‌–1 జాబితాలో) 80,123 మంది ఉన్నారు. వారంతా సొంతింటి కోసం గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపిక అధికారులు, ప్రజాప్రతినిధులకు సవాలుగా మారనుంది. తొలి విడతలో ఈ బాధ్యతను పూర్తిగా ఇందిరమ్మ కమిటీలకే అప్పగించారు. దీంతో అనర్హలకు సైతం పెద్ద ఎత్తున ఇళ్లు వచ్చాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ సారి కమిటీలు అర్హులైన పేర్లను సిఫారసు చేసినప్పటికీ ఎంపిక మాత్రం అధికారులకే అప్పగించారు.

గుడిసెల్లో ఉన్న వారికే ప్రాధాన్యత ..

ఈ విడతలో గుడిసెల్లో నివసించే వారినే ఎంపిక చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ గ్రామాల్లో అలాంటి వారు లేకపోవడంతో ఇంటి పైకప్పుగా తాడిపత్రి వేసుకుని, రేకుల షెడ్డులో నివసించే వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి వారికి తప్పనిసరిగా ఇళ్లను కేటాయించాలి. ఇ లాంటి వారి గుర్తింపు కోసం ఎంపిక చేసిన మండల స్థాయి గెజిటెడ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడుతున్నారు. వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపిక గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో చేయనుండగా, మున్సిపల్‌లో కమిషనర్‌, వార్డు ఆఫీసర్లు చేపట్టనున్నారు.

ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక

రెండో విడతలో జిల్లాకు 3786 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిని మండలాలు, గ్రామాల వారీగా అందిన ఎల్‌–1 దరఖాస్తుల సంఖ్యకనుగుణంగా కేటాయించాం. ఈ విడతలో గుడిసెల్లో ఉన్న వారికే ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాంటి వారి గుర్తింపునకు సర్వే జరుగుతుంది. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తాం. కలెక్టర్‌ ద్వారా వారికి ప్రొసీడింగ్‌ పత్రాలు అందజేస్తాం.

– రెడ్డి శంకర్‌, హౌసింగ్‌ పీడీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement