ఆదిలాబాద్‌టౌన్: ప్రమోషన్లు పొందాలనుకునే సీని యర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించి, షరతులతో కూడిన పదోన్నతులు ఇ వ్వాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూక్యా రాజేశ్‌నాయక్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకువచ్చి సీని యర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. విద్యా హక్కు చట్టం అమలుకు ముందే అనేక మంది ఉపాధ్యాయులు అప్పటి నిబంధనల ప్రకారం ఉద్యోగాల్లో చేరారని, వారికి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు వర్తింపజేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


