కై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇళ్ల తుది బిల్లు మంజూరుకు మార్గం సుగమం అవుతున్నట్లుగా తెలు స్తోంది. గృహ ప్రవేశాలు సైతం పూర్తయిన గ్రామీణ ప్రాంతానికి చెందిన పలువురు లబ్ధిదారులకు తుది బిల్లు చేతికందడం లేదు. దీంతో వారంతా ఎంపీడీవో, హౌసింగ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలాంటి వారి బిల్లుల చెల్లింపుల కోసం కేంద్రం కొత్తగా ఆవాస్‌సాఫ్ట్ పేరిట కొత్త యాప్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఇందిరమ్మ ఇంటి తుది బిల్లు జమ చేయనున్నట్లుగా హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఈ యాప్ ద్వారా నగదు చెల్లింపులు షురు కానున్నట్లుగా పేర్కొంటున్నారు. తద్వారా లబ్ధిదారుల నిరీక్షణకు తెరపడే అవకాశముంది.
చెల్లింపులు ఇలా..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకం కింద నిరుపేదలకు పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేస్తోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున నాలుగు విడతల్లో అందిస్తోంది. బెస్‌మెంట్ స్థాయిలో రూ.లక్ష, గోడలు నిర్మించాక రూ.లక్ష, రూఫ్ స్లాబ్ వేసిన తర్వాత రూ.2లక్షలు, ఇంటి ప్లాస్టరింగ్, కలరింగ్, విద్యుత్ వంటి వాటితో పూర్తయ్యాక మరో రూ.లక్ష చొప్పున విడుదల చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు రూ.5లక్షలు అందుతుండగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి మాత్రం ఫైనల్ బిల్లు రావడం లేదు. కొందరికి రూ.1.60 లక్షలు రావాల్సి ఉండగా, మరికొందరికి రూ.2లక్షలు అందాల్సి ఉంది. ఇందులో రూ.12వేలు మరుగుదొడ్డి నిర్మాణానికి ఉపాధి హామీ నిధుల నుంచి అందిస్తున్నారు. అలాగే మరో రూ.27వేలను వంద రోజుల ఉపాధి పనుల కల్పన కింద పనులు జరిగినట్లుగా వారికి లెక్కకట్టి రూ.3వేల చొప్పున లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మిగతా నిధులను పీఎంఏవైజీ కింద కేంద్రం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేయడం లేదు.
త్వరలోనే చెల్లింపులు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఫైనల్ బిల్లు పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని పెండింగ్‌లో ఉంచింది. ప్రత్యేక యాప్ ద్వారా త్వరలోనే కేంద్రం నుంచి చెల్లింపులు ప్రారంభమయే అవకాశముంది. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి.
– రెడ్డి శంకర్, హౌసింగ్ పీడీ
ప్రత్యేక యాప్‌తో అందనున్న బిల్లు
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఫైనల్ బిల్లు అందించేందుకోసం కేంద్ర ప్రభుత్వం అవాస్ సాఫ్ట్ పేరిట ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా చెల్లింపులు చేసేలా కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ యాప్ వారం నుంచి పది రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని దీంతో ఇళ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులందరికీ చెల్లింపులు జరిగే అవకాశమున్నట్లుగా హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. ఇందిరమ్మ మొదటి విడత కింద జిల్లా వ్యాప్తంగా 16,094 ఇళ్లు మంజూరు కాగా అందులో 2,445 ఇళ్లు పూర్తయ్యాయి. గృహ ప్రవేశాలు కూడా జరిగాయి. ఈ యాప్ అందుబాటులోకి వస్తే వీరిందరికి చివరి బిల్లు చేతికందే అవకాశముంది.


